విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీపట్టిన నాసా

NASA finds crashed Vikram lander
ఏమైపోయిందో… ఎక్కడ కూలిందో అర్థంకాక ఇన్ని రోజులు ఆచూకీ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌ జాడ ఫైనల్‌గా లభించింది. ఇస్రో చంద్రయాన్‌-2లో భాగంగా ప్రయోగించిన విక్రమ్‌ చందమామ దక్షిణ ధ్రువంలో అతి సమీపంగా వెళ్లి కుప్పకూలింది. అప్పట్నుంచి విక్రమ్‌ జాడను వెదుకుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ల్యాండర్‌ను లోకేట్‌ చేసింది. నాసాకు చెందిన లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌ విక్రమ్‌ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించి… ​దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తీసి పంపింది. ​
చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వచ్చి చివరి క్షణంలో కూలిపోయిన విక్రమ్‌ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు చెల్లాచెదురుగా పడ్డాయ్‌. మొత్తం 24 ప్రదేశాల్లో విక్రమ్‌ ల్యాండర్‌ శకలాలు పడినట్టు నాసా గుర్తించింది. అక్టోబర్‌ 14, 15, నవంబర్‌ 11 తేదీల్లో చిత్రాలు తీసి మరీ విక్రమ్‌ ఆచూకీని ధృవీకరించారు. శకలాల్లో మూడు పెద్దగా ఉన్నట్టు నాసా తెలిపింది. ​
ముందు కనిపెట్టింది భారతీయుడే ​
సెప్టెంబర్‌ 7న కుప్పకూలిన దగ్గర్నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ను కనిపెట్టడానికి ఇస్రోతో పాటు నాసా కూడా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా షణ్ముగ సుబ్రహ్మణియన్‌ అనే ఇండియన్‌ ఇంజనీర్‌ విక్రమ్‌కు చెందిన తొలి శకలాన్ని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని షణ్ముగ గుర్తించాడు. షణ్ముగ ఇచ్చిన క్లూతో విక్రమ్‌ ఆచూకీని కనిపెట్టడం నాసాకి మరింత సులువైంది. అందుకే షణ్ముగ కనిపెట్టిన శికలానికి ఎస్‌ అని పేరు పెట్టి క్రెడిట్‌ ఇచ్చింది నాసా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *