నేషనల్ హైవేలవిషయంలో ఏపీకి న్యాయం

Spread the love

National Highway , Justifications for AP… తెలంగాణాకు అన్యాయం .. గడ్కరీపై ఎంపీ వినోద్ ఫైర్

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన పై, ఏపీ లోని జాతీయరహదారుల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలపై మన నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో పర్యటించారు. బీజేపీ రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీకి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏపీకి మోదీ సర్కారు ఎంతో చేసిందని, ఈ ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు. సాగరమాల ప్రాజెక్టు కోసం లక్షా 64 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు కేంద్రమే అందజేస్తుందని తెలిపారు. గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు అందజేస్తామని, గోదావరి, కృష్ణ‌ా, పెన్నా నదుల అనుసంధానం పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని స్పష్టం చేశారు.
విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారని వినోద్ తెలిపారు. దీనిని అనుసరించి 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీలందరితో కలిసి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలను కలిశామన్నారు.రాష్ట్రంలో 1385 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం తెలిపిందని, కానీ అందుకు సంబంధించి ఇంత వరకు అధికారికంగా జీవో విడుదల చేయలేదని వినోద్ అన్నారు. హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున దృష్ట్యా నగరానికి దూరంగా మరో రీజనల్ రింగ్ రోడ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.దీనికి స్పందించిన కేంద్రం నిధులు, భూసేకరణ అంశాల్లో చెరిసగం పంచుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు. 1767 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరో లక్ష కోట్ల విలువైన కొత్త రహదారులను ప్రకటించారని,కానీ తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోలేదని వినోద్ ఎద్దేవా చేశారు. మొత్తానికి ఆంధ్రాలో అభివృద్ధి చేస్తూ తెలంగాణపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని నితిన్ గడ్కరీపై టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *