ఎంపీడీవోపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం

NELLORE RURAL MLA ATTACKED MPDO

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జనం చేశారు. ఒక మహిళా అధికారిణి ఇంటిపై  దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో కోటంరెడ్డి అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లేఅవుట్‌కు పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని, ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా.. మూడు రోజుల క్రితం ఫోన్లో బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సమయంలో మద్యం సేవించి అనుచరులతో కలిసి తన ఇంటికి వచ్చిన కోటంరెడ్డి దౌర్జన్యానికి దిగారని సరళ ఆరోపించారు.

నీటి పైపు లైను ధ్వంసం చేశారని, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కేబుల్ వైర్ ను కట్ చేశారని సరళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి ఫిర్యాదు తీసుకున్నా.. కేసు పెట్టేందుకు శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్‌కు వెళ్తే మాత్రం ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని సరళ వాపోయారు. మండల స్థాయి అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల గతేంటని ఆమె నిలదీశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి వరకు  దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి, ఆయన అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

tags : nellore mla, kotamreddy sridhar reddy, mpdo, sarala,  attack, complaint, protest, case file

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *