కొత్త ఛానళ్ల ఏర్పాటులో వైఎస్సార్ సీపీ?

NEW TV CHANNELS FROM YCP?

  • రాజ్ న్యూస్ ను టేకోవర్ చేసే యోచన
  • మరో కొత్త ఛానల్ ఏర్పాటుకు యత్నాలు
  • మీడియా బలం పెంచుకునేందుకు నిర్ణయం

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ తన మీడియా బలాన్ని పెంచుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. ఎంత ప్రజాబలం ఉన్నప్పటికీ, మీడియా బలం లేకుంటే ఇబ్బందులు తప్పవని గుర్తించిన ఆ పార్టీ.. మీడియాపై తన పట్టును విస్తృతం చేసుకునే చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఏపీలో దాదాపు మీడియా అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాయన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకుని అవి పనిచేస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే. సాక్షి మీడియా మినహా మరే సంస్థా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా లేకపోవడంతో చాలాసార్లు ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు మీడియా బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. అధిక శాతం మీడియా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు ఒక్క పత్రిక, ఒక్క ఛానల్ సరిపోదని వైఎస్సార్ సీపీ పెద్దలు గుర్తించారు. దీంతో రెండు కొత్త ఛానళ్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన పనులను వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొదలుపెట్టినట్టు సమాచారం. రాజ్ న్యూస్ ఛానల్ ను టేకోవర్ చేయడంతోపాటు మరో కొత్త ఛానల్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీడియాలోనూ పైచేయి సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రెండూ కొత్త ఛానళ్లు అయితే, అవి ప్రజల్లోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల రాజ్ న్యూస్ ఛానల్ టేకోవర్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇది కాకుండా వార్తలతోపాటు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు ప్రసారం చేసే కొత్త ఛానల్ ఏర్పాటుకు కూడా కసరత్తు సాగుతోంది. ఈనెల 23న ఫలితాల తర్వాత ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *