న్యాయస్థానం ఎన్కౌంటర్ ను సుమోటోగా తీసుకోవాలి…  

NHRC issues notices to Telangana police

షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన దిశ కేసులో ఊహించని విధంగా  నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సంఘటన స్థలంలో సీన్  రీ  కన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను తీసుకువెళ్లిన పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని  ఆ నలుగురు మానవ మృగాలను హతమార్చినట్టు చెప్పారు.. దీంతో వారిని పోలీసులు దిశను దహనం చేసిన చోటే ఎన్కౌంటర్ చేశారు. ఇక దీని పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైనా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తాము వచ్చి పరిశీలించే వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది .

 ఇక ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాల నుండి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని, నేరస్థులని నిర్ధారణ కాకముందే నిందితులను పోలీసులు హతమార్చారని, ఎన్‌కౌంటర్ చేసిన పోలీస్ సిబ్బందిపై హత్యానేరం కింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. చనిపోయింది రిమాండ్ ఖైదీలే కాబట్టి న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కావాలని నిందితులను ఓ పథకం ప్రకారం ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. నిందితులు నేరం చేశారని నిర్ధారించి శిక్షలు వేయాల్సింది న్యాయస్థానమని, పోలీసులు కాదని మానవ హక్కుల ఫోరం వ్యాఖ్యానించింది. చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఏపీ మానవహక్కుల ఫోరం ఆక్షేపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *