వారణాశిలో నామినేషన్లు వెయ్యనున్న నిజామాబాద్ రైతులు

Nizamabad Farmers are Submitting their nomination in VARANASI

నిజామాబాద్ రైతులు తమ సమస్యల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. మొన్న నిజామాబాద్ లో ఎన్నికల్లో పోటీ చేసిన రైతులు ఇప్పుడు చలో వారణాసి అంటున్నారు . సెంటర్ ఏదైనా తమ టార్గెట్ ఒక్కటే అని తేల్చి చెప్తున్నారు . తమ సమస్యలు పరిష్కరించనందుకు వినూత్న తరహాలో నిరసనలు తెలపడం, నేతల గుండెల్లో వణుకు పుట్టించడం చేసిన రైతులు తాజాగా నిజామాబాద్ తరహాలో పెద్ద ఎత్తున వారణాసిలో రేపు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మొన్న నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితకు ఝలకిచ్చిన తెలంగాణ పసుపు రైతులు ఇప్పుడు ప్రధాని మోడీకి షాకివ్వబోతున్నారు. నిజామాబాద్ తరహాలో వారణాసి లోక్ సభ స్థానం నుంచి మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు వారణాసికి వెళ్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్రం అలసత్వానికి నిరసనగానే తాము వారణాసిలో పోటీకి దిగుతున్నట్లు పసుపు రైతులు స్పష్టం చేశారు. వారణాసిలో పోటీ సందర్భంగా తాము ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని తెలిపారు. పసుపుబోర్డు, మద్దతుధర కోసం తాము చేసిన పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమకు మద్దతుగా వారణాసికి తమిళనాడుకు చెందిన రైతులు కూడా వస్తున్నట్టు రైతులు తెలిపారు. ప్రజలంతా తమకు మద్దతు తెలియజేయాలని వారు కోరారు. అయితే, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశం కాగా ఇప్పుడు మోడీపై పోటీకి దిగడం మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *