NO ISSUES WITH ROHIT
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టంచేశాడు. ఇవన్నీ ఎవరో సృష్టించిన వదంతులని కొట్టిపారేశాడు. వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించాడు. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు అనే వార్తలు తాను కూడా విన్నానని, కానీ అవన్నీ అసత్యాలని స్పష్టంచేశాడు. డ్రెస్సింగ్ రూపంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే విజయం సాధించగలమని పేర్కొన్నాడు. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే తాము ఇంత గొప్పగా రాణించి ఉండేవాళ్లం కాదన్నాడు. తాను ఎవరినైనా ద్వేషిస్తే అది తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని కోహ్లీ తెలిపాడు. ‘‘నేను రోహిత్‌ని ఎప్పుడు ప్రశంసిస్తూనే ఉంటాను. ప్రపంచకప్ హీరో అయిన రోహిత్‌తో నేను గొడవపడటం ఏంటి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ సృష్టించడం వల్ల ఎవరు లాభపడ్డారో అందరికీ తెలుసు. డ్రెస్సింగ్ రూంలో సీనియర్లను ఎలా గౌరవిస్తామో.. జూనియర్లతో కూడా అలానే ఉంటాం’’ అని వివరించాడు. ప్రపంచకప్ ఓటమి ప్రభావం కుర్రాళ్లపై పడకూడదనే ఉద్దేశంతోనే విండీస్ టూర్ కు తాను విశ్రాంతి తీసుకోలేదని చెప్పాడు. రవి శాస్త్రినే కోచ్‌గా కొనసాగిస్తే.. తమకూ ఆనందమేనని విరాట్ పేర్కొన్నాడు. అయితే, ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టంచేశాడు.