జేఆర్సీలో జోష్ లేని కేటీఆర్?

11
NO JOSH IN KTR?
NO JOSH IN KTR?

NO JOSH IN KTR?

కడుపు మంటతో రగిలిపోతున్న బిల్డర్లు

మూడు నెలల్నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

కేటీఆర్ అంటే ఒక బ్రాండ్. యూత్ ఐకాన్. ఐటీ కంపెనీల్ని అమాంతం ఆకర్షించగల సామర్థ్యమున్న యువ నాయకుడు. ఇప్పటివరకూ కేటీఆర్ గురించి మనకు ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ, శుక్రవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో కనిపించిన కేటీఆర్లో కొంత తేడా కనిపించిందని పలువురు రియల్డర్లు అంటున్నారు. ఆయనలో మునుపటి ఉత్సాహమే లేదని ముక్తకంఠంతో చెబుతున్నారు. కారణం.. బీజేపీ నుంచి ఊహించని రీతిలో పోటీ ఎదురు కావడమే అనిపిస్తోంది. కాషాయ పార్టీ అగ్రనాయకత్వం తమ పూర్తి బలగాల్ని హైదరాబాద్లో మోహరించింది. ఎంపీ అరవింద్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య, మరోవైపు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, నేడు నగరానికి రానున్న పీఎం మోడి, రేపు హైదరాబాద్ విచ్చేయనున్న అమిత్ షా.. మొత్తానికి, బీజేపీ డూ ఆర్ డై అన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. మరి, హైదరాబాద్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారా? టీఆర్ఎస్ పాలనను పక్కన పెట్టాలని అనుకుంటున్నారా? అనే విషయం తెలియాలంటే డిసెంబరు మొదటి వారం వరకూ వేచి చూడాల్సిందే.

జేఆర్సీ సభ ఫ్లాఫ్ షో?

జేఆర్సీలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సభకు నిన్న జరిగిన సభ తేడా ఒకటుంది. 2016లో నిర్మాణ సంఘాలన్నీపోటీపడి తమ బిల్డర్లను సభకు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాయి. కేటీఆర్ ఏం చెబుతారోనని అప్పట్లో బిల్డర్లంతా సభకు వచ్చి ఎంతో ఉత్సాహంగా కూర్చుకున్నారు. కానీ, శుక్రవారం జరిగిన సభలో కనీసం 25 శాతం డెవలపర్లు కూడా రాలేదు. మొత్తం కన్సల్టెంట్ల స్టాఫ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, పలు సంస్థల స్టాఫ్ తప్ప సిసలైన డెవలపర్లు పెద్దగా కనిపించలేదు. అంతెందుకు, చోటామోటా బిల్డర్లు కూడా పెద్దగా హాజరు కాలేదు. ఇందుకు ప్రధాన కారణం.. బిల్డర్లంతా కడుపు మంటతో రగిలిపోవడమే. మూడు నెలల్నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అధిక శాతం డెవలపర్లంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బిల్డర్లయితే ఏడుస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ, నిర్మాణ సంఘాల నాయకులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి నోరువిప్పి చెప్పడంలో ఘోరంగా విఫలమయ్యారు. సిమెంటు, స్టీలు ధరలు పెరిగితే గగ్గోలు పెట్టే నిర్మాణ సంఘాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినా పట్టించుకోవడం లేదని బిల్డర్లు  విమర్శిస్తున్నారు.

జేఆర్సీ నుంచి నడ్డా మీటింగ్?

హైదరాబాద్ నిర్మాణ రంగం ఎప్పుడు కావాలంటే అప్పుడు నివేదికలు తయారు చేసిస్తున్నాయి కొన్ని అధ్యయన సంస్థలు. దీంతో, ఈ సంస్థలు అందించే నివేదికల పట్ల ప్రజలకూ నమ్మకం పోతోంది. అసలీ సంస్థలు సరైన నివేదికను ఇస్తున్నాయా? లేదా? అని బయ్యర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక, కేటీఆర్ సమావేశానికి హాజరైన బిల్డర్లలో కొందరు అక్కడ్నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీటింగ్ కు హాజరు కావడం విశేషం. నిర్మాణ సంస్థల్లో కొన్ని వర్గాలు పరోక్షంగా బీజేపీకి సపోర్టు చేస్తున్నాయి. మరి, ఎవరెవరు బీజేపీకి సపోర్టు చేస్తున్నారనే విషయాన్ని టీఆర్ఎస్ ఆరా తీస్తోందని సమాచారం.

real estate summit 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here