మూడేళ్లుగా నగరంలో నో రెగ్యులర్ సేల్స్

8
Govt Serious on UDS sales 
Govt Serious on UDS sales 

No Regular Sales Since 3 Years

హైదరాబాద్ నిర్మాణ రంగం మీదే ఆధారపడ్డ కొందరు బిల్డర్లకు మూడేళ్ల నుంచి నరకమంటే ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరి, కరోనా వల్ల అందరి పరిస్థితి ఇంతే కదా అని మీరు పొరపాటు పడకండి. ఇది కరోనా వల్ల వచ్చిన కష్టం కానే కాదు. కొందరు డెవలపర్లు అనుసరిస్తున్న అక్రమ విధానాల వల్ల సిసలైన బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం ఆరంభమైన ఈ అక్రమ పద్ధతితో హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతింటున్నది.

అసలేం జరిగింది?
గత మూడేళ్ల నుంచి కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. కొనుగోలుదారులకు ఫ్లాట్ల బదులు స్థలాన్ని విక్రయిస్తున్నారు. అంటే, ఒక వ్యక్తి ఫ్లాటు కొనుక్కున్నప్పుడు అతని వాటా కింద వచ్చే అవిభాజ్యపు వాటా (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్) ను కొందరు డెవలపర్లు ముందే అమ్ముతున్నారు. ఈ క్రమంలో.. పేపర్ మీద అపార్టుమెంట్ డిజైన్ గీస్తున్నారు. అందులో కట్టే అంతస్తులు.. ఒక్కో అంతస్తులో వచ్చే ఫ్లాట్లు.. వాటి విస్తీర్ణంను బట్టి ఫ్లాట్ల విస్తీర్ణం నిర్ణయిస్తున్నారు. అందుకు తగ్గ అవిభాజ్యపు వాటాను లెక్కించి.. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీన్ని అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ సేల్ అని అంటున్నారు.

* ఈ విధానంలో కేవలం పేపర్ మీద అపార్టుమెంట్ ఉంటుంది. వాస్తవంగా అయితే అక్కడ బిల్డింగ్ అంటూ ఏమీ కనిపించదు. అంటే, కొనుగోలుదారులకు కళ్ల ముందు స్థలం కనిపిస్తుందే తప్ప అపార్టుమెంట్ కడుతున్న ఆనవాలేం కనిపించవు. సదరు డెవలపర్ స్థానిక సంస్థలు, రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే అట్టి నిర్మాణం ఆరంభం అవుతుందనే విషయం కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్కెట్ రేటు కంటే ధర ముప్పయ్ నుంచి నలభై శాతం దాకా తక్కువుంటుంది. ఈ ఒక్క కారణం వల్ల యూడీఎస్ లో ఫ్లాట్లను కొనడానికి కొందరు ముందుకొస్తున్నారు.

అనుమతి రాకపోతే?
అంతా సవ్యంగా జరిగి అపార్టుమెంట్ కు పర్మిషన్ లభిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ, ఆయా స్థలానికి సంబంధించి భూవివాదాలుంటే.. వాటికి పరిష్కారం లభించక అనుమతి ఆలస్యమైతే? యూడీఎస్ లో ఫ్లాట్లు కొన్నవారు ఆయా ప్రాజెక్టులో సహ యజమానులు అవుతారు కాబట్టి.. వారికి తెలంగాణ రెరా అథారిటీ నుంచి ఎలాంటి సాయం లభించదు. యూడీఎస్లో కొంటే ఈ రిస్క్ అయితే ఎప్పటికీ ఉంటుంది. యూడీఎస్ లో ఫ్లాట్లను విక్రయించి నేటికీ నిర్మాణ పనుల్ని ఆరంభించని సంస్థలు హైదరాబాద్ లో కొన్ని ఉన్నాయంటే నమ్మండి. అవి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాయి. దీంతో, అందులో కొన్నవారు లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వం ఏం అంటోంది?
యూడీఎస్ విధానం వల్ల ప్రభుత్వంలోనూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక ఉన్నతాధికారి యూడీఎస్ వల్ల నష్టమేం లేదని అంటుంటే.. మరొక అధికారి అక్రమ అమ్మకాల తంతును అరికట్టాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. అంటే, ఇద్దరు కీలకమైన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటే.. హైదరాబాద్ నిర్మాణ రంగమూ ఎవరి మాటను వినాలో తెలియక అయోమయం చెందుతున్నారు. అందుకే, యూడీఎస్ విధానం గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర నిర్మాణ సంఘాలు అంటున్నాయి.

Telangana UDS Sales