యురేనియం ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుసుకున్న నిపుణుల బృందం

Spread the love

ON URANIUM PROJECT WAR IN KADAPA DISRTICT

కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. తుమ్మలపల్లిలో ఏర్పాటు చేసిన యురేనియం శుద్ధి ప్లాంట్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షం లో ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామా ప్రజలు యూరేనియం వెలికితీత సంబంధిత చర్యల వలన వ్యాధుల భారిన పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. భూగర్బ జలాలు కలుషితం అవుతున్నాయని, రేడియేషన్ వలన చర్మ సంబంధిత వ్యాధులు వచ్చి పొడి బారి, రాలుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. పశు సంపద, పంటలు నాశనమయ్యాయి అని, మా బాధలు తెలియాలంటే యూసీఐఎల్ అధికారులను ఒక పది రోజులు గ్రామాల్లో ఉండాల్సిందిగా కోరారు. ఈ ఇబ్బంది లేకపోతే తామే గ్రామాలని వొదిలి వెళ్తామని తెలిపారు.అల్యూమినియం పాత్రలో నీరు పోసి 25 రోజులు ఉంచితే వాటికీ చిల్లులు పడుతున్నాయని,అలాంటిది తమ శరీరాలు ఎలా తట్టుకోగలవ్ అని అన్నారు. ప్లాంట్ ఏర్పాటు చేసినపుడు పరిసర ప్రాంతంలో 12 లక్షల మొక్కలు నాటుతామని అన్నారు, కనీసం 10 వేలు కూడా నాటలేదు అని అన్నారు. మాకు న్యాయం జరగకపోతే సీఎం జగన్ ఇంటి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని అన్నారు.
అన్ని సమస్యలను పట్టించుకొనే జగన్ మరి ఈ సమస్యని ఎందుకు పట్టించుకోవడం లేదు. లేదంటే అధికారుల జాప్యమా? జగన్ కి ఇంకా తెలీదా? దీంతో ప్రజల అభ్యంతరాలను తెలుసుకోవటానికి వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. తాము రోగాలతో ఇంకెన్నాళ్లు మగ్గిపోవాలని ప్రశ్నించారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించాలంటూ నిపుణుల బృందాన్ని వేడుకున్నారు జనం.
పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలోని ఎమ్‌.తుమ్మలపల్లె వద్ద… 2008లో రూ. 11 వందల 4 కోట్లతో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. 2012 ఏప్రిల్‌ 20న యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కుమార్‌ బెనర్జీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముడి యురేనియాన్ని శుద్ధి చేస్తూ వస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ దీనిని శుద్ధి చేసే సమయంలో పూర్తిస్థాయిలో యంత్రాల్లో ఫిల్టర్‌ కాకుండా కొంతమేర వ్యర్థాల్లో పోతోంది. ఇది ఇంజనీర్లకు సవాల్‌గా మారింది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్లాంటు నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో వాతావరణం దెబ్బతింటోంది. సమీప గ్రామాల్లో మట్టి, నీరు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు అధ్యయనంలో తేలింది. భార లోహాలు పరిమితిని మించి ఎక్కువస్థాయిలో ఉన్నట్లు తేలింది. ఈ భార లోహాలు ఏడు రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని… వీటిలో కేన్సర్, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధ వ్యాధులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు పరిశోధనకారులు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ వెంటనే అధ్యయన కమిటీని వేశారు. దీంతో రంగంలోకి దిగిన కమిటీ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. నివేదికను తయారుచేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది.

KADAPA LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *