ఆపరేషన్ ఆకర్ష్ ఆగిందా?

Spread the love

OPERATION AAKARSH STOPPED

  • ఆచితూచి అడుగులు వేస్తున్న కేసీఆర్
  • ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం

తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ కి తాత్కాలిక విరామం ప్రకటించారా? మే 23న సార్వత్రిక ఫలితాల వెల్లడి తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వంద సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన టీఆర్ఎస్.. 88 సీట్ల దగ్గర ఆగిపోయింది. అయితే, ఫలితాలు వెల్లడైన వెంటనే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గులాబీ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం 90కి చేరింది. తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. దీంతో కేసీఆర్ లక్ష్యం వంద దాటేసింది. అదే స మయంలో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది పార్టీ ఫిరాయించడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడమే కాకుండా, సాంకేతికంగా ఆ పార్టీ సభ్యులు టీఆర్ఎస్ లో విలీనం కావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో విలీనానికి సంబంధించిన ప్రక్రియను కూడా అధికార పార్టీ మొదలుపెట్టింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ ప్రక్రియ ముగించే దిశగా కేసీఆర్ వేగంగా అడుగులు వేశారు. అయితే, ఈలోగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కేసీఆర్ గత కొంత కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆయనకు సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఎన్డీఏకే పట్టం కట్టిన నేపథ్యంలో కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం ప్రస్తుతానికి అసాధ్యమనే విషయాన్ని ఆయన గుర్తించారు. పైగా ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం కేసీఆర్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీకి మేజిక్ ఫిగర్ కి అవసరమైన సీట్లు రాని పక్షంలో తమ రాజకీయ ప్రయోజనాల మేరకు యూపీఏకి మద్దతిచ్చే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు టీఆర్ఎస్ లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ కి, కాంగ్రెస్ పార్టీ విలీనానికి కామా పెట్టారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ వైపు వెళ్లాల్సి వస్తే, రాష్ట్రంలోని ఈ పరిణామాలు ఆయనకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ విలీన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కేంద్రంలో కేసీఆర్ మద్దతుతో యూపీఏ సర్కారు ఏర్పడితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విలీనం ఉండదు. మళ్లీ ఎన్డీఏ గద్దెనెక్కితే మాత్రం యాధావిధిగా కాంగ్రెస్ విలీన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *