ఒక వ్యక్తికే అధికారం వద్దు.. సంకీర్ణమే ముద్దు

PAWAN IN KURNOOL

  • కర్నూలు సభలో పవన్ వ్యాఖ్య
  • బాబు, జగన్ లా అబద్ధపు హామీలివ్వనని వెల్లడి

ఒక వ్యక్తికే అధికారం ఇస్తే.. పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అంతా అస్తవ్యస్తమవుతుందని, అందువల్ల అందరం సంకీర్ణ ప్రభుత్వం వైపు దృష్టి సారిద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండబోవనేలా దీటుగా ఎదుగుతామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన కర్నూలులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులాలను విడదీసి కాదు.. వాటి ఐక్యతతో రాజకీయాలు చేయాలని, జనసేన అదే చేస్తోందని వెల్లడించారు. మార్పు రావాలంటే తనకు జేజేలు కొట్టక్కర్లేదని, 18 ఏళ్లు నిండినవారు మీ తొలి ఓటు ఎవరికేస్తారో ఆలోచించి నిర్ణయించుకోవాలని సూచించారు. లారీ టైర్లు కోసి చెప్పులు కుట్టించుకున్న కాన్షీరాం స్థాపించిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీల సరసన నిలిచి దేశంలో రాజకీయ వ్యవస్థను శాసించేదిగా ఎదిగిందని పవన్‌ గుర్తుచేశారు. జనసేన ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుందని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆ డబ్బులు ఆయన జేబులో నుంచి ఇవ్వడం లేదని, ప్రజా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారని పవన్‌ వివరించారు. ఈ డబ్బులతోనే ఓట్లు కొనేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం జగన్‌, చంద్రబాబుల మాదిరి అబద్ధపు హామీలనిచ్చి మోసం చేయబోనన్నారు. అందరికీ అండగా నడుస్తానని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి గొప్ప మార్పు తెస్తామని చెప్పడం లేదని, నిలకడగా.. బలంగా రాణిస్తానని స్పష్టంచేశారు. ఒక రోజు తనను టీడీపీ మనిషంటున్నారని, మరోరోజు వైఎస్సార్ సీపీ, ఇంకోరోజు బీజేపీ, టీఆర్ఎస్ వ్యక్తి అంటూ చెబుతున్నారని.. ఎవరేం చెప్పినా నమ్మొద్దని పవన్ సూచించారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *