సినిమా చేసే యోచనలో పవన్?

Spread the love

PAWAN REACHED HYD

  • హైదరాబాద్ చేరిన జనసేన అధినేత
  • ప్రస్తుతం విశ్రాంతి.. ఫలితాలను బట్టి సినిమాపై నిర్ణయం

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గెలుపు ఓటములపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. విజయం తమదంటే తమదేనంటూ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలు ప్రకటించుకుంటున్నాయి. కానీ ఈ రెండు పార్టీలకు గట్టి పోటీనిచ్చిన జనసేన మాత్రం సైలెంట్ అయ్యింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా ముందుకు రాలేదు. ఓటేసిన తర్వాత కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయంటూ రెండు నిమిషాలు మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. అనంతరం పార్టీ ఆఫీసులో మౌనంగా కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మరుసటి రోజు గుంటూరు జిల్లాలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే.. అప్పటి నుంచి బయటకు రాలేదు. దీంతో పవన్ ఎక్కడున్నారనే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఆయన అమరావతిలో ఉన్నారా? గాజువాకలో ఉన్నారా? లేక హైదరాబాద్ లోనా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

అయితే, గత కొంత కాలంగా బిజీ షెడ్యూల్ తో గడిపిన పవన్.. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. త్వరలోనే ఆయన సినిమా చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ప్రచారంలో గడ్డంతో ఉన్న పవన్.. తాజాగా నీట్ గా షేవ్ చేసుకుని స్మార్ట్ గా తయారయ్యారని.. సినిమా చేయడం కోసమే ఆయన తన లుక్ మార్చుకున్నారని పేర్కొన్నారు. ఒకరిద్దరు నిర్మాతల నుంచి ఆయన గతంలో తీసుకున్న అడ్వాన్సును ఇంకా వారికి తిరిగి ఇవ్వలేదు. ఈ వివరాలను ఎన్నికల అఫిడవిట్ లోనూ పొందుపరిచారు. ఈ నేపథ్యంలో వారి సొమ్ము వెనక్కి ఇవ్వకుండా, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారితో సినిమా చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మే 23న వెల్లడైన ఫలితాలను బట్టి సినిమా చేయాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఆంధ్రావారిపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన పవన్.. ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్లారంటూ పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రాలో రెండు ఇళ్లు పెట్టుకుని కొడుతున్న చోటుకు రావడం ఏమిటని ప్రశ్నలు కురిపిస్తున్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *