తిరుమల కొండపైకి మరో దారికి ప్లాన్ సిద్ధం

Spread the love

Prepare another way to get to Tirumala Hill

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు శుభవార్త‌. తిరుమ‌ల కొండ మీద‌కు మలుపులు లేకుండా మరో ప్ర‌త్యామ్నాయ మార్గం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి దూరం త‌గ్గ‌టంతో పాటుగా సుర‌క్షితంగా కొండ పైకి చేరుకొనే విధంగా ప్లాన్ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఎల్‌అండ్‌టీ కంపెనీ సర్వే చేసింది. నివేదికను మరోవారంలో తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అందించనుంది. పాల‌క వ‌ర్గం ఆమోదిస్తే..త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభం కానున్నాయి.

తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, రెండో కనుమ మార్గంలో కొండచరియలు విరిగి పడే ప్రమాదం పెరగడంతో, మరో కనుమదారిని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఈ కొత్త రోడ్డు 2.1 కిలోమీటర్ల దూరంతో నాలుగు వరుసలుగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో సర్వే చేసిన ఎల్అండ్ టీ, మరో వారంలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులకు రిపోర్టును అందించనుంది.

అలిపిరి నుంచి తిరుమలకు దారి తీసే రెండో కనుమ మార్గంలో 13వ కిలోమీటర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త దారి, జీఎన్సీ టోల్ గేట్ వరకూ ఉంటుంది. సరిగ్గా 13వ కిలోమీటర్ నుంచే రెండు రహదారులను కలిపే లింక్ రోడ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల వరకూ అవసరమని, కొన్ని చోట్ల నేలను చదును చేయాల్సి వున్నందున మరో రూ. 2 కోట్ల వరకూ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రమే పాలకమండలి ఈ కొత్త రోడ్డు నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *