చేజారిన మ్యాచ్ ను ఒడిసి పట్టుకుంది

Spread the love

PUNJAB SUPER VICTORY

  • ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ అనూహ్య విజయం
  • శ్యామ్ కరన్ హ్యాట్రిక్ తో కింగ్స్ ఎలెవన్ గెలుపు

గెలిచే మ్యాచ్ ఓడిపోవడం.. ఓడిపోయే మ్యాచ్ గెలవడం.. ఇదే టీ20 క్రికెట్ ప్రత్యేకత. సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిలీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. ఢిల్లీ గెలుపు లాంఛనమే అనుకున్న స్థితి నుంచి ఆ జట్టు ఆలౌట్ అయి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసింది. 21 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మరో 17 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 7 వికెట్లనూ కోల్పోయి పరాజయం పాలైంది. ఓడిపోతామనుకునే మ్యాచ్ ను పంజాబ్ అనూహ్యంగా ఓడిసిపట్టుకుని టీ20 మజా ఏమిటో చవిచూసింది.  మొహలీలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (29 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ లేకపోవడం పంజాబ్ స్కోర్ పై ప్రభావం చూపించింది. ఓపెనర్లు కె.ఎల్‌.రాహుల్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కరన్‌ (10 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడినప్పటికీ, వెంటవెంటనే పెవిలియన్ చేరారు. మయాంక్‌ అగర్వాల్‌ (6) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో మిల్లర్, సర్ఫరాజ్ లు జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో 99 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్న పృథ్వీ షా తొలి బంతికే డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. శ్రేయస్‌ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు), ధావన్‌ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) కూడా ఔట్ కావడంతో రిషభ్‌ పంత్‌  (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇంగ్రామ్‌ (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు బాధ్యత భుజాలకెత్తుకుని, జాగ్రత్తగా ఆడారు. దీంతో ఢిల్లీ విజయం దిశగా పయనించింది. ఈ దశలో పంత్ ఔట్ కావడం, ఆ వెంటనే ఇంగ్రామ్ కూడా పెవిలియన్ చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎలాంటి ఒత్తిడీ లేకపోయినా ఢిల్లీ జట్టు టపటపా వికెట్లు పోగొట్టుకుని ఓటమి చవిచూసింది. పంజాబ్ ఆటగాడు స్యామ్ కరన్ హ్యాట్రిక్ సాధించాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *