యాదాద్రి స్తంభాలపై టీఆర్ఎస్ ప్రచారం ..

Raj Sing Fires on Promoting in Yadadri Pillars

తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా ఆలయాన్ని తీర్చి దిద్దుతోంది. ఈ ఆలయం నిర్మాణం సైతం అధ్బుతంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే.. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న ఈ ఆలయంలో శిల్పాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం ..టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు చెక్కి ఉంటుంది. అంతటితో ఆగలేదు…టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్‌ కిట్‌, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి. దీంతో..ఇది ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు చెక్కారా..లేక ఎవరైనా అత్సుత్సహం ప్రదర్శించారా అనే చర్చ మొదలైంది.

తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ అంశంపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే భవ్యమైన మందిరమని.. అది ఏ పార్టీది కాదని రాజా సింగ్ అన్నారు. అయితే, ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలు చెక్కడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజా సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.యాదాద్రి ఆలయం టీఆర్ఎస్ పార్టీది కాదని, కేసీఆర్ తన జేబులోంచి తీసిన డబ్బులు ఏమీ గుడి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం లేదని రాజా సింగ్ అన్నారు. ప్రజల సొమ్ముతోనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాంటప్పుడు కేసీఆర్, కారు బొమ్మలు ఆలయ స్తంభాలపై ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *