మై హోమ్ పై రాజపుష్ప బయ్యర్ల అటాక్

rajapushpa residents attack my home group

కోకాపేటలోని రాజపుష్ప ఏట్రియా ప్రాజెక్టులో నివసిస్తున్న వారంతా మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కోకాపేట్ వీధుల్లో నిరసన తెలిపారు. వీరు ఇంతగా రెచ్చిపోవడానికి కారణాలేమిటో తెలుసా? మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో చేపడుతున్న బ్లాస్టింగుల వల్ల పక్కనే గల రాజపుష్ప ఏట్రియాలో పునాదులకు బీటలు పడ్డాయి. 15 అంతస్తుల ఈ భవనంలో మొత్తం పగుళ్లు ఏర్పడ్డాయి. మొత్తం స్ట్రక్చర్ దెబ్బతిన్నది. ఆ బ్లాస్టింగ్ ఎంత శక్తిమంతంగా ఉందంటే.. నేను తింటున్న అన్నం పళ్లెం కింద పడి పోయిందని రాజపుష్ప ఏట్రియాలో నివసించే వ్యక్తి తెలిపారు. ఈ పేలుళ్ల వల్ల దెబ్బతిన్న తమ స్ట్రక్చర్ కు మై హోమ్ సంస్థ నష్టపరిహారం అందజేయాలి మరో బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ పగుళ్ల దెబ్బకు రాజపుష్ప స్ట్రక్చర్ దారుణంగా దెబ్బతిన్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు తప్పును ఎదుట వారి మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నార్సింగి మున్సిపల్ అధికారులేమో అనుమతి హెచ్ఎండీఏ ఇచ్చింది కాబట్టి, వారే దీనికి బాధ్యత వహించాలని అంటున్నారు. బ్లాస్టింగులకేమో మైనింగ్ శాఖ అనుమతినిచ్చిందని పోలీసులు అంటున్నారు. ఇక ప్లానింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణ ఈ సంఘటన గురించి తనకు ఏమాత్రం సమాచారం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. బ్లాస్టింగులకు పోలీసులే అనుమతినిస్తారని తెలిపారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన మై హోమ్ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకుంటారని ఆయన్ని ప్రశ్నిస్తే.. పూర్తి సమాచారం తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించనని దాటవేశాడు. ఇక, మైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టరేమో పేలుళ్లకు తాము అనుమతినివ్వమని స్పష్టం చేశారు. ఎస్పీ, కలెక్టర్లు మాత్రమే ఇందుకు సంబంధించిన ఎన్వోసీని మంజూరు చేస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం చెన్నైలో ఉండే చీఫ్ కంట్రోలర్ నుంచి ఎన్వోసీ తీసుకోవాలని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మై హోమ్ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పేలుళ్లను నిర్వహిస్తుందా అనే సందేహం రాజపుష్ప ఏట్రియా కొనుగోలుదారుల్లో నెలకొన్నది. మొత్తానికి, ఈ సంఘటన వారిని భయకంపితుల్ని చేసింది.

My Home Group Latest Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *