చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరికంబం ఎక్కాల్సిందే

Spread the love

Rapist Punished Hanging

చిన్నారుల బతుకులను చిద్రం చేస్తున్న కామాంధులపై కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్రం. పసిమొగ్గలన్న విషయాన్ని మర్చిపోయి..తమ కామవాంఛ తీర్చుకుంటున్న మృగాలకు ఉరితో కట్టడి చేసే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ మధ్యన పెరిగిన చిన్నారులపై లైంగికవేధింపుల నేపథ్యంలో అలాంటి ఆరాచకాలకు పాల్పడే వారికి ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. చిన్నారులను లైంగిక దాడుల నుంచి కాపాడే చట్టంగా చెప్పే పోక్సో 2012 చట్టానికి తాజాగా పలు సవరణలు చేశారు.

ఢిల్లీలో కేంద్ర కేబినెట్ తాజా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయాల్ని మోడీ సర్కారు తీసుకుంది. దీంతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ప్రతిరోజు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు చేస్తూ వారి మరణాలకు కారణం అవుతున్న మృగాళ్ళకు కఠిన శిక్షలు పడకపోవటంతో రెచ్చిపోయి పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై పాశవిక దాడి చేసి హత్య చేశాడు ఓ శాడిస్ట్ .చిన్నారులతో పాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేసేలా చట్టాన్ని సవరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా నిర్మూలించే పనిలో భాగంగా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారికి భారీ జరిమానాలతో పాటు.. జైలుశిక్ష విధించేలా పోక్సో చట్టంలో కీలక మార్పులు చేసినట్లుగా వెల్లడించారు. తాజాగా చేసిన మార్పులతో పోక్సో చట్టంలోని 2 – 4 – 5 – 6 – 9 – 14 – 15 – 34 – 42 – 45 సెక్షన్లను సవరించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అయినా చిన్నారులపై లైంగిక వేధింపులు కట్టడి అవుతాయని ఆశిద్దాం.

Rapist Punished Hanging

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *