రియల్ హీరో.. ‘బ్రదర్ ఆఫ్ ద నేషన్’ సోనూసూద్

real hero sonu sood

సోనూసూద్ .. సినిమాల్లో విలన్.. కానీ ఆఫ్ స్క్రీన్ లో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన తను.. ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నాడు. దిక్కులేని వారందరినీ అన్నలాగా, బిడ్డలాగా అక్కున చేర్చుకున్నాడు. ప్రాంతంతో పనిలేదు. కష్టం ఉందని తెలిస్తే చాలు.. ఆ కష్టం తీర్చేవరకూ కునుకు తీయడం లేదు. అలాగని అపర కుబేరుడా అంటే కాదు. తనకున్నదాంట్లోనే పదిమందికి సాయం చేస్తూ.. బ్రదర్ ఆఫ్ ద నేషన్ అని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోన్న ఆ రియల్ హీరో సోనూసూద్. ఇవాళ సూపర్ స్టార్ బర్త్ డే.

సోనూసూద్ పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. నాగ్ పూర్ లో ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆ టైమ్ లోనే మోడలింగ్ చేశాడు. ఫ్యాషన్ షోస్ లో ర్యాంప్ వాక్ చేశాడు. అలా గ్లామర్ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తను సినిమా నటుడు కావాలని.. యాక్టింగ్ లో ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు. తమిళ్ లో కళైంగర్ అనే సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అటుపై నాగార్జునతో నటించిన సూపర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. సూపర్ లో నాగార్జునకు సమానమైన పాత్ర. వెంటనే అతడు. అతడులో మల్లి పాత్ర అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. కానీ అప్పటికే తమిళ్, హిందీల్లో చాలా బిజీగా ఉండటంతో తెలుగులో వెంటవెంటనే సినిమాలు చేయలేకపోయాడు. కొంత గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ అశోక్ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు.

ఆ పాత్ర తర్వాతే అతనికి కోడి రామకృష్ణ అరుంధతిలో అవకాశం వచ్చింది. అరుంధతిలో పశుపతి పాత్రలో సోనూసూద్ నటనకు పిల్లలే కాదు.. పెద్దలు కూడా భయపడిపోయారు. ఈ మూవీతో ఉత్తమ నటుడుగా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ రావడం విశేషం.  అరుంధతి తర్వాత సోనూసూద్ అన్ని భాషల్లోనూ చాలా బిజీ అయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి సినిమాలోనూ హీరోకు సమానమైన పాత్ర. మోస్ట్ ఇంటెలిజెంట్ విలన్ గా సూపర్బ్ అనిపించుకున్నాడు. సోనూసూద్ ప్రత్యేకత అదే. ఏ పాత్ర చేసినా ఆకట్టుకుంటాడు. అతని నటనలో ఓ ప్యాషన్ కనిపిస్తుంది. అందుకే తమకు సమానమైన విలన్ రోల్ అయినా హీరోలూ అభ్యంతరం పెట్టలేదు. విలన్ పాత్రల్లో సౌత్ లోనే కాక బాలీవుడ్ లో సైతం అద్బుతంగా రాణిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ దబాంగ్ నుంచి చాలా సినిమాల్లో మెప్పించాడు. కొన్ని సినిమాల్లో చాలా పాజిటివ్ పాత్రలూ చేసి ఆశ్చర్యపరిచాడు.

తెలుగులో రామయ్యా వస్తావయ్యా, దూకుడు, ఆగడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమాలో అతని నటనే హైలెట్ అంటే అతిశయోక్తి కాదు.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు సోనూసూద్. నటనలో విలన్ అయినా.. జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. మొన్నటి వరకూ కేవలం నటుడుగా మాత్రమే తెలిసిన అతను.. ఇప్పుడు కరోనా టైమ్ లో ఎన్నో ప్రభుత్వాలు చేయలేని పని చేస్తూ.. శెభాష్ అనిపించుకుంటున్నాడు. నలుగురిని ఆదుకోవాలంటే.. స్టార్డమ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉండాలి. ఆ మనసు మెండుగా ఉన్న సోనూసూద్.. ఇలాగే ఆపన్నులకు సాయం చేసేలా మరింత శక్తిని సంపాదించుకుని నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. అతనికి మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *