Realtors May Go For Negative Vote
రైలు పట్టాలు వేయాలంటే ఏం చేస్తారు? ఇదివరకే ఉన్న పట్టాలకు ఏమాత్రం సంబంధం లేకుండా, దాన్ని పక్కనే మరో కొత్త లైను వేసుకుంటూ వెళతారు. అంతేతప్ప, ఉన్న పట్టాలను పీకేసి.. దాన్ని పక్క నుంచి రైలు, ఇతర గూడ్సులను వెళ్లనీయకుండా నిలిపివేసి కొత్త రైలు పట్టాలు వేయరు కదా. ఇంత కామన్ సెన్సు విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించలేకపోయింది. ధరణిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం ఎందుకు? ఒకవైపు ఉన్న వ్యవస్థను నడిపిస్తూనే కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తే అసలు ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడే ఈ నిర్ణయమే అధికార పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెను శాపంగా మారింది. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి సీట్లు తగ్గితే మాత్రం తప్పకుండా రిజిస్ట్రేషన్ వ్యవస్థ నిలిచిపోవడమో కారణంగా మారుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
* ఇంట్లో ఏదైనా పెళ్లి చేయాలన్నా.. ఇంకేదైనా మంచి కార్యం చేయాలన్నా.. చాలామంది తమ వద్ద ఉన్న ప్లాటో, స్థలమో విక్రయిస్తుంటారు. మూడు నెలల్నుంచి ఈ అవకాశమే లేకపోవడంతో ఒక్కసారిగా సామాన్యులతో పాటు రియల్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, కారులో పెట్రోల్ పోయించుకోవడానికి సొమ్ము లేకుండా నానా అవస్థ పడుతున్నారు. కారణం.. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడమే. అందుకే, గత మూడు నెలల్నుంచి రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఇంటి యజమానులు, ఏజెంట్లు, డాక్యుమంట్ రైటర్లు.. ఇలా ఈ రంగంపై ఆధారపడ్డ వారి నోటికాడ ముద్ద లాగేసుకోవడంతో అధికార పార్టీపై గరంగరం అవుతున్నారు. అందుకే, ఈ సారి అధికార టీఆర్ఎస్ పార్టీపై రగిలిపోతున్నారు. ఎలాగైనా టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ అవసరమైతే పాత విధానాన్ని అమల్లోకి తెస్తామని వ్యక్తిగత హామి ఇచ్చారు. మరి, ఇది ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.