బిల్డర్ల అత్యాశే కొంపముంచిందా?

Reasons For Realty Down in Hyderabad

వావ్.. హైదరాబాద్ వెలిగిపోతుంది. మౌలికంగా ఎంతో డెవలప్ అవుతోంది..

జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగ్యనగరానికి క్యూ కడుతున్నాయి..

ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ఇక్కడే తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేశాయి. 

తెలంగాణ ప్రభుత్వం నగరాభివ్రుద్ధికి పెద్ద పీట వేస్తోంది.. 

ఇలా, గత ఆరేండ్ల నుంచి దాదాపు అన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితం అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ వెలిగిపోతుందని, దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అంటున్నాయి. హైదరాబాద్ లో రహదారులు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణ వంటివి జోరుగా జరుగుతున్నాయని అనేక పత్రికలు రాస్తున్నాయి. మరి, ఇవన్నీ నిజమైతే,

హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎందుకు దారుణంగా దెబ్బతిన్నది?

ఎందుకు ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి ఫ్లాట్లను కొనలేకపోతున్నారు?

ఎందుకు ప్రాపర్టీ షో లకు వచ్చే జనాలు ఫ్లాట్లను కొనకలేకపోతున్నారు?

ఇవన్నీ ప్రతి నిర్మాణ సంస్థ యజమాని వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఒకప్పుడేమో ఉద్యమం వల్ల అమ్మకాలు జరగడం లేదని వాపోయారు. మరి, ఇప్పుడు అంతా బాగున్నప్పుడు ఎందుకు ప్రజలు ఇళ్లను కొనడానకి ముందుకు రావడం లేదు. ఎందుకో తెలుసా?

  • నిర్మాణ సంస్థలు నేలవిడిచి సాము చేస్తున్నారు. ప్రాథమిక విషయాలు మర్చిపోయారు. వాస్తవాలు అర్థం చేసుకోవడం లేదు. తోటోడు తొడ కోసుకుంటే.. తాను మెడ కోసుకుంటా అన్నట్లుగా వ్యవహరించడం మొదలెట్టారు. ఫాల్స్ ప్రిస్టేజ్ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక బిల్డర్ రెండు ఎకరాల్లో ప్రాజెక్టు చేస్తుంటే, మరో బిల్డర్ ఐదు ఎకరాలు.. మరో అతను పది ఎకరాలు.. ఇంకో వ్యక్తి పదిహేను ఎకరాలు.. ఇలా ఎవరికీ వారే పోటీపడుతూ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. అంతేనా?
  • మధ్యతరగతి ప్రజలను పూర్తిగా విస్మరించారు. వారికి ఎలాంటి ఫ్లాట్లు కావాలి? ఏయే విస్తీర్ణంలో ఫ్లాట్లు అయితే కొనుక్కోగల్గుతారు? వంటి విషయాల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. తక్కువ విస్తీర్ణం బదులు పెద్ద సైజు ఫ్లాట్లను డిజైన్ చేయడం మొదలెట్టారు. సామాన్యులకు 800 నుంచి 1000 చదరపు అడుగుల ఫ్లాట్లు ఉన్నా సరిపోతాయనుకుంటే, వీళ్లేమో 1200 నుంచి 1400 చదరపు అడుగుల్లో కట్టడం మొదలెట్టారు. చిన్న సైజులైతే తాము అనుకున్న డిజైన్ రాదని కొందరు బిల్డర్లు అంటున్నారు. డిజైన్ గురించి ఆలోచించి.. కట్టిన తర్వాత.. చివరకు ఎవరు కొనుగోలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆలోచించడం లేదు. మేం కడితే చాలు.. ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారులే అన్నట్లుగా వీరు తయారయ్యారు. ఇప్పటికైనా వీరి ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా ఉందని, ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుందని.. డెవలపర్లు క్రమక్రమంగా ఫ్లాట్ల ధరలను పెంచడం మొదలెట్టారు. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం డెవలప్మెంట్ మీద తీసుకుని ఫ్లాట్లను కడుతున్నారు. అంటే, స్థలానికి వీరు నయా పైసా పెట్టక్కర్లేదు. కేవలం స్థలానికి సంబంధించిన లీగల్ క్లియరెన్స్ తీసుకుని, మంచి డిజైన్స్ గీయించి.. స్థానిక సంస్థల వద్ద అనుమతి తీసుకుని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. అంటే, అధిక శాతం డెవలపర్లు భూమిని కొనుగోలు చేసి ఫ్లాట్లు కట్టే విధానాన్ని మర్చిపోయారు. స్థల యజమాని వద్ద స్థలాన్ని తీసుకుని.. అతను ఆడినట్లు ఆడుతున్నారు.. పాడినట్లు పాడుతున్నారు. అతని గొంతెమ్మ కోరికెలను తీర్చడానికో మరెందుకో గానీ ప్లానింగులో డిజైనింగులో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయక.. కొనుగోలుదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
  • గత రెండు, మూడేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్థలాల ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ శివార్లలోనూ భూములకు రేట్లకు రెక్కలొచ్చాయి. అంటే, కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లు వంటివారంతా ఇష్టం వచ్చినట్లు భూముల ధరల్ని పెంచడం మొదలెట్టారు. ఒకటే స్థలం అగ్రిమెంట్ల మీద రేట్లు పెంచడం ప్రారంభించారు. కానీ, చివరికీ ఆ భూమిని అధిక ధర పెట్టి కొనుగోలు చేయడం నిలిచిపోయింది. దీంతో, చివర్లో కొన్నవాళ్లంతా బొక్కాబోర్లా పడుతున్నారు.
  • ఇదే పరిస్థితి ఫ్లాట్ల విషయంలోనూ జరుగుతోంది. గత రెండేళ్లలో చదరపు అడుక్కి రూ.500 నుంచి 1500 దాకా కొందరు డెవలపర్లు పెంచేశారు. ఫలితంగా, అప్పటివరకూ ఆయా ప్రాజెక్టులను అతి దగ్గరగా ఫాలో అయ్యవారు.. అప్పటికే వాటి రేట్లను వాకబు చేసినవారు.. పెరిగిన రేట్లను చూసి షాక్కు గురయ్యారు. ఫ్లాటు కొనుగోలు చేయాలనే ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. దీంతో, హైదరాబాద్లో కొంతకాలం నుంచి ఫ్లాట్లు కొనడం నిలిపివేశారు. ఇప్పటికైనా బిల్డర్లు వాస్తవాలను ద్రుష్టిలో పెట్టుకుని ఫ్లాట్లను నిర్మించాలి.

Hyderabad Real Estate News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *