RGV GOT GOOD CRAZE IN PAK
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. కాకపోతే, ఆయనకు పాకిస్థాన్లో కూడా వీరాభిమానులున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్లో 24 నుంచి 45 ఏళ్ల లోపు యువత ఆర్జీవీ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తున్నారని సమాచారం. తను ఎక్కువగా అండర్ వరల్డ్, మాఫియా నేపథ్యంలో సినిమాలు తీయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆయన సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై దేశాల ప్రేక్షకులు వీక్షిస్తుండగా.. బంగ్లాదేశ్తో పాటు మరో పదమూడు ముస్లీం దేశాల ప్రజలే రాంగోపాల్ వర్మ సినిమాల్ని విశేషంగా చూస్తున్నారని తెలిసింది. మొత్తానికి, వారికి కావాల్సిన మసాలాను ఆయన సినిమాల్లో ఉండటం వల్లే ఆర్జీవీకి ప్రపంచవ్యాప్త ఆదరణ లభిస్తోంది.
వాస్తవానికి ఒక సినిమాను తీసిన తర్వాత పబ్లిసిటీ ఎలా చేయవచ్చనే విషయం ఆర్జీవీకి తెలిసినంతగా సినిమా పరిశ్రమలో ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు అలాంటివి మరి. అంతెందుకు, ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం మీద ఆర్జీవీ ఒక సినిమా తెరకెక్కించాడు. భారతదేశ ప్రజలందరికీ దావుద్ అంటే విలన్. ముంబై బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం పాకిస్థాన్లోనో దుబాయ్లోనో తల దాచుకుంటున్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరి, అలాంటి నేపథ్యం గల వ్యక్తి మీద ఆర్జీవీ నేరుగా ఒక సినిమానే తీస్తున్నాడు. అంటే, కాంట్రవర్సీ సబ్జెక్టును ఎంచుకుని, ఆసక్తికరంగా తీర్చిదిద్ది బాక్సాఫీసును కొల్లగొట్టడం ఆయనకు కొత్తేం కాదు. ఇలాంటి కథాంశాన్ని ఎంచుకుంటే సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా పెరుగుతాయి. వాటిని చేరుకునేలా ఆర్జీవీ సినిమా ఉంటే హిట్ అవుతుంది లేదా ఫట్ అవుతుంది. మరి, ప్రస్తుతం ఆర్జీవీ తాజా సినిమా డీ కంపెనీ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియాలంటే విడుదల అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే.