RRR shooting
దటీజ్ రాజమౌళి.. ఒక విషయాన్ని జనాల్లోకి ఎంత హైప్ తో తీసుకువెళ్లాలో బాగా తెలిసిన వారిలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే డైరెక్టర్. మార్కెటింగ్ స్ట్రాటజీలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు కనిపించరు. అందుకే అతనితో సినిమాలు చేసే నిర్మాతలు బడ్జెట్ గురించి ఆలోచించరు. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైంది.. ఈ మాట చెప్పడానికి ఎంత క్రియేటివిటీ వాడాడో తెలుసా..? ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ మాటను ఇలాగే చెబితే అతను రాజమౌళి ఎందుకవుతాడు. ఓ సాధారణ దర్శకుడుగా ఆగిపోతాడు. మార్చి నెల వరకూ ఈ మూవీ షూటింగ్ సజావుగానే సాగింది. కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయింది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇతర కమిట్మెంట్స్ కూడా ఈ సినిమాకు జరిగిన ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఓ దశలో చాలామంది రాజమౌళిపై గుస్సా అయ్యారు కూడా. కానీ అవన్నీ తేలిపోయేలా అదిరిపోయే వీడియోతో తమ షూటింగ్ మళ్లీ మొదలైందని చాలా క్రియేటివ్ గా చెప్పాడు.
ఏడు నెలల గ్యాప్ తర్వాత మొదలైన షూటింగ్ కాబట్టి.. అప్పుడు వదిలేసిన ఎక్విప్ మెంట్స్ అన్నీ దుమ్ముకొట్టుకుని ఉన్నాయి. కాస్ట్యూమ్స్ నుంచి సెట్ ప్రాపర్టీస్ వరకూ.. లొకేషన్ నుంచి ఇతర వ్వవహారాల వరకూ అన్నీటినీ క్లీన్ చేసుకుని కెమెరా సెట్ చేసుకుని అప్పుడు రాజమౌళి రెడీ హీరోస్ .. యాక్షన్ అనగానే ఎన్టీవోడు బుల్లెట్ బండిపైనా.. చరణ్ గుర్రంపైనా వచ్చే సీన్ షూట్ చేశారు. మొత్తంగా ఇలా మొదలైన షూటింగ్ ఏకధాటిగా రెండు నెలల పాటు జరగబోతోందని సమాచారం. ఇక ఇదే వీడియోలో కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానూ చెప్పాడు జక్కన్న. సెట్ లో ఎప్పట్లానే ఆయన భార్య రమ, శ్రీవల్లి, కార్తికేయ అందరూ కనిపిస్తున్నారు. మొత్తంగా కరోనా నుంచి బయటపడిన తర్వాత అంతా కలిసి మళ్లీ హ్యాపీగా సెట్స్ లోకి అడుగుపెట్టినట్టుగా కనిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా చెప్పిన డేట్ కే వస్తారా లేక ఇంకేదైనా ఆలస్యం ఉంటుందా అనేది చూడాలి.