Rs.1000 FINE ON NOMULA?

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ధరించకపోతే జరిమానా కూడా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాస్కు పెట్టుకోని వారిపై రూ.1000 జరిమానా కూడా విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో కూడా హాజరుపర్చాలని ఆదేశించింది. మరి, ఈ నిబంధన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీకి చెందిన అభ్యర్థి నోముల భగత్ కు వర్తించదా? పక్కనే మంత్రి జగదీష్ రెడ్డి ఎంచక్కా మాస్కు పెట్టుకుని ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, కనీసం సీనియర్ని చూసైనా ఈ యువ అభ్యర్థి నేర్చుకోవచ్చు కదా? అని సాగర్ ప్రజలు అంటున్నారు.
* అసలే రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ఇదివరకే సమాచారం పంపింది. రూ. వెయ్యి జరిమానాతో పాటు కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. మరి, ఈ నిబంధన నోముల భగత్ కు వర్తించదా? ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు వర్తించదా? ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా? వీరు సామాన్యులకు ఎలాంటి సందేశమిస్తున్నారు? ఇలా మాస్కుల్లేకుండా ప్రచారంలో పాల్గొంటున్న ఒక్కొక్క ప్రజా ప్రతినిధి మీద కనీసం వెయ్యి రూపాయలు జరిమానా ఎందుకు విధించకూడదు?
* తాజాగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క లింగపూర్ మండలంలోనే 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరి, ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న నాగార్జున సాగర్లో ఎంతమందికి కరోనా వచ్చే అవకాశాలున్నాయి? ఈ విషయం ఎలాగూ మరో రెండు వారాల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, కరోనా ఎవరికీ చుట్టం కాదనే విషయం మర్చిపోవద్దు. సీఎం కేసీఆర్ గతంలోనే పదేపదే చెప్పారు. కరోనా మంచి సోషలిస్టు అని.. ఎవరు ఆహ్వానిస్తే వాళ్ల దగ్గరకొచ్చేస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. మరి, ఇప్పుడీ ప్రజాప్రతినిధులకు ఈ విషయం అర్థం కావడం లేదా? మాస్కు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల కరోనాను ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తునట్లా? కాదా? మరి, వీరి మీద రూ.1,000 జరిమానా ఎందుకు విధించకూడదు? కేసులెందుకు నమోదు చేయకూడదు?