ఆర్టీసీ కార్మికులు సరెండర్ కావాలి

RTC Workers Should Surrender
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల పైన ప్రభుత్వం సామ దాన బేధ దండోపాయాలను  అమలు చేస్తోంది. ఒక వైపు ఉద్యోగులను ఇక విధుల్లోకి తీసుకొనేది లేదు.. వారే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని అయోమయం లోకి నెట్టేసిన ప్రభుత్వం.. మరోవైపు ఉద్యోగులకు సరెండర్ కావాలంటూ మంత్రులు సూచిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైన తమ తప్పు తెలుసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. యూనియన్ నేతల మాటలు కార్మికులు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా పట్టింపు లేనట్టు ఉంటె ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై కూడా ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెకు మద్దతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీకి సిగ్గుండాలని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ కార్మికులకు చెల్లించని స్థాయిలో తెలంగాణ సర్కారు జీతాలు ఇస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలు తమ స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

ఆర్టీసీ కార్మికులను బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ కేసీఆర్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఇదే సమయంలో మరో మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఇదే రకంగా స్పందించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కొందరి ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను కొనసాగించటం మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణలో వస్తున్న జీత భత్యాలు లేవని వివరించారు. అసలు బీజేపీ నేతలకు ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సంస్థ మనుగడను పరిగణలోకి తీసుకొని కార్మికులు వ్యవహరించాలని సూచించారు. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు వారంతటగా వారు కూర్చుకున్న కొమ్మును నరుక్కున్నారని చెబుతుంటే..మరో వైపు మంత్రులు ఇప్పటికే కార్మికులు ప్రభుత్వానికి సరెండర్ కావాలని చెప్పటం పైన ప్రభుత్వ వ్యూహం స్పష్టమవుతోంది.

tags: tsrtc rtc strike, dussehra festival, passengers, rtc JAC, minister yerrabelli dayakar rao, niranjan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *