సాహో మూవీ రివ్యూ

SAAHO MOVIE REVIEW

నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌, మందిరా బేడీ, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం: ఆదిత్య సింగ్‌, ఎహ్‌సాన్‌ నూరాని, గురు రన్‌ద్వా, లాయ్‌ మెండోసా, శంకర్‌ మహదేవన్‌, బాగ్చి,
నేపథ్య సంగీతం: జిబ్రాన్
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌
దర్శకత్వం: సుజీత్‌

 

ఇట్స్ షో టైం.. అంటూ దాదాపు రెండేళ్ల క్రితం ఓ చిన్న టీజర్ తో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన సాహో.. తదనంతరం కూడా ఉత్కంఠ కలిగించింది. భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, ముందెన్నడూ తెలుగు సినిమాలో చూడని రీతిలో ఫైట్లు, ఛేజింగులతో ప్రభాస్ అభిమానుల్లోనే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడిని ఎంతో ఆతృతతో ఎదురుచూసేలా చేసిన సాహో సినిమా శుక్రవారం విడుదలైంది. బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ సినిమా కావడం.. రూ.300 కోట్ల బడ్జెట్.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం ఒకే ఒక్క చిన్న సినిమా చేసిన సుజీత్.. ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టాడా? చూద్దాం.

కథేంటి?

ఊహించినట్టుగానే ఇది అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ప్రపంచంలోనే కరడుగట్టిన నేరస్తులు ఉండే వాజీ సిటీని పృథ్వీ రాజ్ (టినూ ఆనంద్) అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని తన కనుసన్నల్లో శాసిస్తుంటాడు. తన కుమారుడు దేవరాజ్ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్ చేరదీసిన రాయ్ (జాకీ ష్రాఫ్) రాయ్ గ్రూప్ పేరుతో ఓ సిండికేట్ నడుపుతుంటాడు. దీంతో రాయ్ మీద దేవరాజ్ పగ పెంచుకుంటాడు. ఈ క్రమంలో ముంబైలో వెళ్లిన రాయ్.. ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఆ సమయంలోనే రూ.2 లక్షల కోట్లతో ముంబైకి వస్తున్న ఓ ఓడ పేలిపోతుంది. ఇక అండర్ కవర్ పోలీసు అధికారిగా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ముంబైలో పనిచేస్తుంటాడు. మరో పోలీసు అధికారిణి అమృత (శ్రద్ధా కపూర్) తో ప్రేమలో పడతాడు. ముంబైలో జరిగిన ఓ భారీ చోరీ కేసును ఇరువురూ కలిసి దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో మాఫియా డాన్‌ రాయ్‌, ఆయన ముఠాని అశోక్‌ ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకీ అశోక్ ఎవరు? సాహోకి అతడికి ఏమిటి సంబంధం? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

ప్రభాస్ ఒన్ మ్యాన్ షో..

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాలో అంతా తానే అయి నడిపించాడు. రెండు వేరియేషన్లలో బాగా నటించాడు. లుక్స్ పరంగా కూడా డార్లింగ్ అదిరిపోయాడు. యాక్షన్ సన్నివేశాలు, రొమాన్స్ సీన్లలో బాగా చేశాడు. రెండు మూడు చోట్ల షర్ట్ లేకుండా కనిపించి అభిమానులను ఫిదా చేశాడు. శ్రద్ధా కపూర్‌ విషయానికొస్తే, యాక్షన్‌ సన్నివేశాల్లో బాగా కన్పించింది. గ్లామరస్‌గానూ, నటనతోనూ ఆకట్టుకుంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌ తమ తమ పాత్రల్లో రాణించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

విశ్లేషణ

రూ.300 భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుజీత్ అంతకుముందు చేసిన కేవలం ఒక్కటే. రన్ రాజా రన్ అనే ఆ సినిమా పర్వాలేదనిపించింది. కానీ ప్రభాస్ ను ఏం చెప్పి ఒప్పించాడో కానీ సాహో వంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా వినియోగించుకోవాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ.. సుజీత్ అవేమీ తీసుకున్నట్టు కనిపించలేదు. కథ, కథనం మీద ఎలాంటి శ్రద్ధా పెట్టలేదు. సినిమా చూసినవారికి కూడా కథేంటో సరిగా అర్థం కాదు. అంత కన్ఫ్యూజన్ నెలకొంది ఈ సినిమాలో. యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నా.. కథ, కథనం సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? పైగా ఎడిటింగ్ మరీ పేలవంగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు కూడా సినిమా చాలా బోరింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా గాడిన పడుతుందనుకుని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కాస్త బాగానే ఉన్నా.. ఓవరాల్ గా చూస్తే మాత్రం సినిమా అస్సలు ఆకట్టుకోదు. ఏవో కొన్ని సీన్లు రాసుకుని వాటిని పేర్చుకుంటే వెళ్లిపోయిన ఫీలింగ్ కనిపిస్తుందే తప్ప.. సినిమా చూసిన అనుభూతే కలగదు. పైగా కథ చెప్పిన విధానం చాలా కన్ఫ్యూజన్ గా ఉండటంతో సగటు ప్రేక్షకుడికి ఏమీ అర్థం కాదు. సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో వుంది. యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. పాటల లొకేషన్లు సూపర్. ఎడిటింగ్‌ మాత్రం చాలా దారుణం.

బలాలు

  • ప్రభాస్
  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • ప్రొడక్షన్‌ వాల్యూస్‌
  • సినిమాటోగ్రఫీ

బలహీనతలు

  • కథ
  • స్క్రీన్‌ప్లే
  • ఎడిటింగ్‌
  • సాగదీత

ఒక్క ముక్కలో..

సాహో.. 300 కోట్లు స్వాహా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *