సబిత కారెక్కడం ఖాయమే

Spread the love

SABITHA DECIDED TO JOIN TRS

  • ఫలించని కాంగ్రెస్ బుజ్జగింపులు
  • కుమారుడికి చేవెళ్ల ఎంపీ సీటు కోరిన సబిత
  • అది కొండాకే ఖాయం చేశామన్న హస్తం పార్టీ
  • టీఆర్ఎస్ లో చేరడానికే చేవెళ్ల చెల్లెమ్మ మొగ్గు
  • నేడు కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆమె కాంగ్రెస్ ను వీడటం ఖాయమైంది. బుధవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో సబిత, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న సబిత.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే.. గులాబీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ నివాసంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సబిత, కార్తీక్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కార్తీక్‌ రాజకీయ భవిష్యత్తుతో పాటు సబితకు మంత్రివర్గంలో స్థానంపై కేటీఆర్‌ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం.

ఈ విషయం తెలిసన వెంటనే టీపీసీసీ ప్రముఖుల రంగంలోకి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్‌ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు సబిత నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కోరారు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని రంగంలోకి దించారు. పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సబితకు పార్టీ మారకుండా నచ్చచెప్పిన రేవంత్‌.. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయంలో పునరాలోచించుకున్న సబిత.. మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు. రాహుల్ తో సమావేశం కావాలని నిర్ణయించుకోవడంతో టీఆర్ఎస్ లో చేరడానికి బ్రేక్ పడినట్టే అని అంతా భావించారు. అయితే, చేవెళ్ల ఎంపీ టికెట్ ను తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఇవ్వాలని సబిత కోరగా.. అందుకు సానుకూల స్పందన రాలేదని సమాచాం. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల టికెట్ ఆయన ఇవ్వడానికే కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి అవకాశం ఇవ్వలేమని చెప్పినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లోనే చేరాలని సబిత నిర్ణయం తీసుకున్నారు.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *