శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా మావోల రిక్రూట్ మెంట్ ?

Satavahana University Eccentric Naxals Recruitment

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా మరోసారి మావోయిస్ట్‌ల రిక్రూట్‌మెంట్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రదేశంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం వారి కార్యకలాపాలు గత కొంత కాలంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులంతా నక్సలైట్ల సిద్ధాంతానికి ఆకర్షితులై అడవి బాట పట్టారు. ఈ క్రమంలో పోలీస్ నిఘా పెరగడంతో వర్సిటీలో ఆ ప్రభావం క్రమేపీ తగ్గిపోయింది. ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకునే వారిని ఉద్యమం వైపు మళ్లించిన నక్సల్స్ పార్టీ.. ఇప్పుడు అదే తరహా పద్ధతిని యోచిస్తున్నట్లుగా నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శాతవాహన యూనివర్సిటీలో కూపీ లాగుతున్నారు

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఎంత క్రీయాశీలక పాత్ర పోషించిందో తెలిసిన విషయమే. టీవీవీ పేరిట ఈ సంస్థ మేధావి వర్గాన్ని ఒకే వేదిక పైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. కాగా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీవీవీ కార్యకలాపాలు నిలిచి పోయాయి. స్వంత రాష్ట్రం కోసం ఏర్పడిన టీవీవీ పేరును ఇప్పుడు మావోలు వాడుకుంటూ తెలంగాణ విద్యార్థి వేదికను ఏర్పాటు చేశారన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో చదువుతూ టీవీవీలో నాయకులుగా పని చేస్తున్న సూర్యుడు, మహేష్, రాజులతో పాటు..మరికొంతమందికి మావోలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి సంస్థను బలోపేతం చేస్తామంటూ మావోయిస్టు నేత చంద్రన్నను కలిసి నిధులు తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తమకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని టివివి నాయకుడు మహేష్ చెబుతున్నారు. ఆరోపణలు చేయడం కాదు రుజువులు ఉంటే చూపించండి అని సవాల్ విసురుతున్నారు.

ఇటు యూనివర్సిటీకి సంబంధించిన ఓ మహిళా ప్రొఫెసర్ విద్యార్థులను స్టడీ టూర్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లి మావోయిస్టులతో భేటీ అయ్యేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సదరు ప్రొఫెసర్ విద్యార్ధులతో కలిసి దిగిన ఫోటోలు చూపెడుతూ మావోయిస్టులను కలిసేందుకు వెళ్లారంటూ విద్యార్ధి సంఘాలు అంటున్నాయి. దీంతో మావోలతో సంబంధాలు ఉన్నవారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలంటా ఆందోళనకు కూడా చేపట్టారు. కాగా శాతవాహన వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న శాతవాహన యూనివర్సిటిలో మావోల కలకలం యూనివర్సిటీలోని మిగితా విద్యార్థులను మాత్రం ఆందోళన గురి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *