sp balu no more
కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. 55 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం తొలుత విషమించి, అనంతరం కుదుటపడింది. కరోనా నుంచి కూడా కోలుకున్నారు. కానీ గురువారం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేసినా ఫలితం దక్కలేదు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. గురువారం సాయంత్రమే బాలు ఆరోగ్యం విషమంగా మారిందని తెలియడంతో అభిమానులతోపాటు సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కమల్ హాసన్ ఆస్పత్రికి వచ్చి బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నుంచి ఎంజీఎం ఆస్పత్రికి అభిమానులు పోటెత్తారు. బాలు ఆరోగ్యంగా రావాలని ప్రార్థనలు చేశారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1969లో తొలిసారిగా తెరపై కనిపించిన బాలు.. తర్వాత పలు సినిమాల్లో నటించారు. 11 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు.