చెన్నైకి హైదరాబాద్ చెక్

SRH BEAT CSK IN IPL

  • 6 వికెట్ల తేడాతో సూపర్ కింగ్స్ చిత్తు
  • మూడు మ్యాచ్ ల పరాజయం తర్వాత గాడిలో పడ్డ సన్ రైజర్స్

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గాడిలో పడింది. హ్యాట్రిక్ పరాజయాలతో డీలాపడిన జట్టు.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్‌ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ పెద్దగా నిలబడలేకపోయారు. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 70 పరుగులతో ఉన్న చెన్నై.. మిగిలిన 11 ఓవర్లలో కేవలం 62 పరుగులు మాత్రమే జోడించింది. 10వ ఓవర్లో వాట్సన్ ఔట్ కాగా, మరో మూడు బంతుల వ్యవధిలోనే డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. ఇక అక్కడి నుంచి చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది.

ఓపెనర్లు ఔట్ అయిన తర్వాత ఐదుగురు బ్యట్స్ మెన్ వచ్చినప్పటికీ, ఏ ఒక్కరూ సరిగా పరుగులు తీయలేకపోయారు. రైనా(13), జాదవ్ (1), బిల్లింగ్స్ (0) తక్కువ వెంటవెంటనే ఔట్ అయ్యారు. తర్వాత రాయుడు (21 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు), జడేజా (20 బంతుల్లో 10 నాటౌట్‌) కాస్త పరుగులు తీయడంతో చెన్నై ఇన్నింగ్స్ 132 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. వార్నర్‌ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్‌స్టో (44 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.  కష్ట సాధ్యం కాని లక్ష్యాన్ని హైదరాబాద్ సులభంగానే అందుకుంది. వార్నర్ చెలరేగి ఆడటంతో 24 బంతుల్లో 10 ఫోర్లతో అర్ధసెంచరీ చేశాడు. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (3) విఫలం కాగా… విజయ్‌ శంకర్‌ (7)ను తాహిర్‌ పెవిలియన్‌ చేర్చాడు. 17వ ఓవర్లో దీపక్ హుడా (13) ఔటయ్యాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన బెయిర్‌స్టో మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించాడు. కాగా, వెన్నునొప్పి కారణంగా చెన్నై కెప్టెన్ ధోని ఈ మ్యాచ్ ఆడలేదు. దీంతో సురేశ్ రైనా తమ జట్టుకు నాయకత్వం వహించాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *