సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court Key Decision .. 5 యంత్రాల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తప్పనిసరి

ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మూడు రోజులకు ముందు సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ కు కీలక ఆదేశాలను జారీ చేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సంఖ్యను పెంచాలని ఆదేశించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సూచించింది. ఇదివరకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక ఈవీఎంకు చెందిన స్లిప్పులను మాత్రమే లెక్కించే వారు. ఇకపై ఒకటికి బదులుగా మొత్తం అయిదు ఈవీఎంల నుంచి వెలువడే స్లిప్పులను పరిగణనలోకి తీసుకుని లెక్కింపు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్.. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై తెలుగుదేశం పార్టీ సహా దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈవీఎంలను భారతీయ జనతాపార్టీ ట్యాంపరింగ్ చేసిందంటూ వారు అనుమానించారు. ఏ పార్టీకి సంబంధించిన బటన్ నొక్కినప్పటికీ.. బీజేపీకే ఓటు పడేలా ట్యాంపర్ చేశారంటూ 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీన్ని నిరోధించడానికి వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ట్రయల్ (వీవీప్యాట్) స్లిప్పులను కూడా లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కిందటి నెల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, దీనికి ప్రధాన కారణం- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు- తొలిసారిగా వీవీప్యాట్ల లెక్కింపు విషయాన్ని ప్రస్తావించారు. వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించడం వల్ల బీజేపీకి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనే అంశంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈవీఎంలపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉన్నందు వల్ల వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లనే ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్, టీడీపీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ ససేమిరా అనడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కనీసం 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక ఈ కేసును విచారించిన, వాదోపవాదాలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాది వాదంతో సంతృప్తి చెందలేదు . దీంతో నియోజకవర్గానికి ఒక ఈవీఎంకు బదులుగా అయిదింటిని లెక్కించాలని ఆదేశించింది.నిజానికి- ఇప్పటిదాకా.. ఒక నియోజకవర్గానికి సంబంధించి, ఒక ఈవీఎంను మాత్రమే తీసుకుని, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే విధానం అమలులో ఉంది. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, దీని సంఖ్యను పెంచడమో లేదా..ఏకంగా ఈవీఎంలను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టడమో చేయాలని 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పును వెలువడించింది. ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఈవీఎంను కాకుండా.. వాటి సంఖ్యను పెంచాలని ఆదేశించింది. ఇకపై అయిదు ఈవీఎంల నుంచి వెలువడే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సూచించింది. ఈ దిశగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బెంచ్.. కేంద్ర ఎన్నికల కమిషన్ ను సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *