SYE RAA MOVIE REVIEW
ఆహా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చిరు నటనను ప్రేక్షకులు ఆస్వాదించి!!
అప్పుడెప్పుడో ఓ గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, ఇంద్ర వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరంచాడు.
మళ్లీ, చాలాకాలం విరామం తర్వాత.. చిరంజీవి సైరా సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. మరి, ఈ సినిమా ఎలా ఉందంటే..
స్వాతంత్య్ర పోరాటానికి తొలిసారి నాంది పలికిన వీరుడి కథే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. కాకపోతే, ఈయన కథకు చరిత్రలో పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. అందుకే, ఇది దర్శకుడికి ప్లస్ పాయింట్ అయ్యింది. నిజానికి, ఈ సినిమా తీయాలని చిరు ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. కాకపోతే, నేటికీ వాస్తవరూపం దాల్చింది. బ్రిటీషు దుర్మార్గాలకు బలైపోతున్న తరుణంలో రేనాడు ప్రాంతంలోని అరవై ఒక్క పాలేగాళ్లు పరిపాలిస్తున్నప్పటికీ, అధికారమంతా బ్రిటీషు దొరలదే. పంట పండినా, పండకున్నా, తప్పనిసరిగా వారికి శిస్తు కట్టాల్సిందేనంటూ బ్రిటీష్ కలెక్టర్ హుకుం జారీ చేస్తాడు. ఇక, అప్పటికే పూర్తిగా అలసిన ప్రజలకు ఆయన ఆదేశం నచ్చదు. ఈ భూమి మాదైనప్పుడు శిస్తు నీకెందుకు కట్టాలంటూ బ్రిటీషు రాచరికంపై యుద్ధం ప్రకటిస్తాడు. కాకపోతే, మిగతా పాలేగాళ్లలో పెద్దగా ఐక్యమత్యం ఉండకపోవడం వల్ల కొందరు వెన్నుపోటు పొడుస్తారు. ఈ క్రమంలో దేశం కోసం ఆయనేం చేశాడో చూపించే సినిమానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రజాబలంతో పోరాటాన్ని ఒంటరిగా నరసింహారెడ్డి మొదలెడతాడు. ఇతర పాలెగాళ్లు సాయం చేస్తారు. దీంతో ఆంగ్లేయులపై నరసింహారెడ్డి పోరాటం చేసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒవుకు రాజు (సుదీప్), వీరపాండి (విజయ్ సేతుపతి), గోసాయివెంకన్న (అమితాబ్‌బచ్చన్), వీరారెడ్డి (జగపతిబాబు) లక్ష్మి (తమన్నా)ల పాత్రలు దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. భార్య సిద్దమ్మ(నయనతార) కొన్ని సీన్లే కనిపించినా ఆమె నటన బాగుంది.
ఈ సినిమాలో చిరంజీవి నటన సూపర్. ఎక్కడా తన గాంభీర్యం మిస్ అవ్వకుండా ప్రేక్షకులను రంజింప చేశాడు. చాలాకాలం తర్వాత పాత చిరంజీవిని చూడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పోరాట సన్నివేశాలెంతో అవలీలగా చేసేశాడు. చిరు పలికిన సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. రత్నవేలు ఛాయాగ్రహణం, రాజీవన్ ఆర్ట్ వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తన తండ్రి కలను నెరవేర్చడం కోసం రామ్‌చరణ్ ఎక్కడ రాజీపడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు సురేందర్‌రెడ్డికి మిగతా సాంకేతిక వర్గం నుంచి చక్కటి తోడ్పాటు లభించింది. దీంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కాకపోతే, కథ విషయంలో కాస్త ఓవర్ ఫ్రీడమ్ తీసుకున్నాడని అక్కడక్కడా అనిపిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గతంలో వేరే సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. అయినప్పటికీ, సైరా అభిమానులకు నిజమైన దసరాను అందించడంలో చిరంజీవి విజయం సాధించారు.