ఆర్టీసీ విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పలేదట

TALASANI CONTROVERSY COMMENTS ON RTC

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేది టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో లేదని పేర్కొన్నారు  రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఆర్టీసీ భవిష్యత్తుపై కొందరు లేని పోని అసత్య ప్రకటనలు చేస్తున్నారని.. అలాంటి దుష్ప్రచారాలు నమ్మెద్దని సూచించారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయాలని సవాల్ విసిరారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందని.. అందుకే ఇదివరకు ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ సహా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు తలసాని.

అగ్గికి ఆజ్యం పోస్తున్నారా?
శనివారం నాడు టీఆర్ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తలసాని ఆర్టీసీకి సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు. ఆర్టీసీ సమ్మెను కాంగ్రెస్, బీజేపీ నేతలు అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నారని.. వాటిని తిప్పి కొడతామని హెచ్చరించారు తలసాని. అగ్గిని తగ్గించాల్సింది పోయి ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీపై ఎన్నడూ లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆర్టీసీని అక్కడి ప్రభుత్వాలు ఏం చేశాయో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు.మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని అక్కడి బీజేపీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తే.. చత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఆర్టీసీని రద్దు చేసిందన్నారు. అదలావుంటే రైల్వేతో పాటు ఎయిర్ ఇండియాను సైతం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు.. ఎప్పుడు ఏ అంశం దొరుకుతుందా అని ఎదురు చూసే విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా పండుగల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కొందరి వల్ల కార్మికులు సమ్మెకు దిగారని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం మెరుగు పరుస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల విషయంలో మంత్రులు సైతం గులాబీ బాస్ ఆజ్ఞానుసారమే నడుచుకుంటున్నారు.

tags : tsrtc, rtc strike, trs manifesto, minister, talasani srinivas yadav

నల్లారిని మించుతున్నకేసీఆర్

కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు దారుణహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *