మాట్లాడే క్రికెట్ బాల్ వస్తోంది

TALKING CRICKET BALL

ఈ బాల్ బ్యాట్ కి తగిలింది.. ఇది నిఖార్సైన ఎల్బీడబ్ల్యూ.. అని ఆ బంతే చెబితే ఎలా ఉంటుంది? కచ్చితంగా ఇలా కాకపోయినా.. బౌలర్ వేసిన బంతికి సంబంధించిన వివరాలను రియల్ టైమ్ లో అందించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే టెక్నాలజీ సాయంతో క్రికెట్ అత్యున్నత స్థాయికి వెళ్లింది. అంపైరింగ్ తప్పిదాలు లేకుండా చూసేందుకు ఇప్పటికే ఐసీసీ ఎన్నోరకాల సౌకర్యాలను తీసుకొచ్చింది. బెయిల్స్ వెలగడం, బంతి బ్యాట్ ను తాకిందో తెలుసుకునేందుకు అల్ట్రా ఎడ్జ్, అంపైరింగ్ నిర్ణయాలను సమీక్షించేందుకు డీఆర్ఎస్.. ఇలా చాలా వాటిని మనం చూస్తున్నాం. త్వరలో మరో విప్లవాత్మక మార్పు రానుంది. బౌలర్ వేసిన బంతే.. తనకు సంబంధించిన వివరాలను రియల్ టైమ్ లో చెప్పేస్తుంది. తన లైన్ లో మార్పు ఏదైనా ఉందా? బ్యాట్ కు తగిలిందా లేదా? అది కచ్చితమైన ఎల్బీడబ్ల్యూనే కాదా వంటి వివరాలను ఎప్పటికప్పుడు చేరవేస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన బెన్ టాటర్స్ ఫీల్డ్ అనే క్రీడా పరికరాల రూపకర్త ఈ వినూత్నమైన బంతిని రూపొందించాడు. సాధారణ క్రికెట్ బంతిలోనే ఓ మైక్రో చిప్ అమర్చాడు. దీంతో అది తన కదలికలను, వేగాన్ని, వెళుతున్న దిశను కచ్చితంగా లెక్కగట్టి, ఆ వివరాలను రియల్ టైమ్ లో డేటా సెంటర్ కు పంపిస్తుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్ట్రేలియాకు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ కూకబుర్రా అంగీకరించింది. ‘తొలిసారిగా బంతి మాట్లాడబోతోంది’ అని కూకబుర్రా ప్రతినిధి షెనాన్ గిల్ వ్యాఖ్యానించారు.  కూకబుర్రా స్మార్ట్ బాల్.. చూడటానికి సాధారణ బంతిలాగే ఉంటుందని, కానీ బౌలర్ విసిరిన బంతికి సంబంధించిన అన్ని వివరాలను డేటా సెంటర్ కు పంపిస్తుందని చెప్పారు. పరీక్షల అనంతరం అన్నీ ఓకే అయితే, ఐసీసీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *