టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్న వలసలు

TDP LEADERS JOINING IN YCP

  • ఎన్నికల ముంగిట పార్టీ వీడుతున్న కీలక నేతలు
  • మొన్న మేడా.. నిన్న ఆమంచి.. నేడు అవంతి..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి వలసల భయం పట్టుకుంది. ఆ పార్టీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో దానిని అధిగమించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు వరాల మీద వరాలు గుప్పిస్తున్నారు. అలాగే ఒకప్పుడు హోదా వేస్ట్ అన్న ఆయనే.. తాజాగా హోదా కోసం పోరాడుతోంది తామేనని గట్టిగా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాలపైనా దృష్టి సారించి బిజీ అయిపోయారు. అయితే, బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వలసలు మాత్రం ఆగడంలేదు. టీడీపీ నుంచి కీలక నేతలు వైఎస్సార్ సీపీ వైపు వెళ్తుండటంతో టీడీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. అసంతృప్త నేతలను ఓ వైపు బుజ్జగిస్తుండగానే మరోవైపు కొన్ని గెలుపు గుర్రాలు జగన్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుండటం వారికి మింగుడుపడటంలేదు. కొన్ని రోజుల కిందట కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరారు. తర్వాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ కు జై కొట్టారు. తాజాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ వీడనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సైతం వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు వర్గాన్ని ప్రభావితం చేయగలిగే తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరితే అది ఆ పార్టీకి బలమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  అలాగే మంత్రి గంటా శ్రీనివాస్ పై కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆయన కూడా టీడీపీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం సాగింది. కానీ ఆ విషయాన్ని ఆయన ఖండించడంతో ప్రస్తుతానికి అది ముగిసింది. ఈ నేపథ్యంలో ఎవరెవరు పార్టీని వీడే అవకాశం ఉందో అనే విషయంపై అధినేత చంద్రబాబు ఆరా తీస్తున్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *