Telangana Congress in-charge Tagore Hard comments
తెలంగాణ సంపద ఒకే కుటుంబానికే పరిమితం అవుతుందని, తెలంగాణ ప్రజలు ఏమాత్రం లబ్ధి పొందడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఈ అంశంపై పార్టీలకతీతంగా ప్రచారం చేసి ప్రజల మద్దతు పొందాలన్నారు. ఇన్ చార్జీగా నియమితులయ్యాక మొదటిసారి ఆయన టీపీసీసీ నేతలు, ఏఐసీసీ కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాల తర్వాత అక్టోబరు మొదటి వారంలో ఠాగూర్ హైదరాబాద్ వస్తారని తెలిపారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, ఖమ్మం, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపైనా పార్టీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవగాహన, సమన్వయంతో కలిసి పోరాడాలని, క్రమశిక్షణ, కేడర్ నిర్మాణంతో విజయం సాధించవచ్చన్నారు. దుబ్బాక టౌన్, మండలాలు, 146 గ్రామాలకూ త్వరలో ఇంచార్జీలను నియమిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎల్పీలు నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.