తెలంగాణ ఈఎస్ఐలో భారీ కుంభకోణం?

TELANGANA ESI SCAM?

తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది . మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికర ధరలకు మందులు కొనుగోలు చేసి సుమారు రూ.200 కోట్లు కుంభకోణానికి తెరతీశారని తెలుస్తోంది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణియే సూత్రధారి కావడం విశేషం. విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ స్కాం బట్టబయలైంది. అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని సమాచారం. అవసరం లేకపోయినా ఏడాదికి సంబంధించి మందులను, వైద్య పరికరాలను ఒకేసారి కొనుగోలు చేశారని తెలుస్తోంది. పదివేల రూపాయలు విలువ చేసే మందులను లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఏసీబీ, ఆడిటింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు తేల్చారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణికి సంబంధించి బంధువులకు అర్హత లేకున్నా కోట్లాది రూపాయలు విలువ చేసే మందుల కొనుగోలులో బినామీలుగా వాడుకున్నారని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో మందుల కొనుగోలులో భారీస్కాంపై మంగళవారం ఉదయం నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు, ఆడిటింగ్ అధికారులు ఆమె కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో విస్తుగొలిపే విషయాలు తెలుసుకున్నారు. దేవికారాణి సుమారు రూ.200 కోట్లకు పైగా కుంభకోణాలకు పాల్పడినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో దేవికారాణితోపాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు, ఒక ఫార్మసిస్ స్టోర్ జేడీ, ఇద్దరు ఫార్మసిస్ట్ ల పాత్ర ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషికి అందజేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు మందుల కొనుగోలులకు సంబంధించి కమిటీలను నియమించలేదని అధికారులు గుర్తించారు. అలాగే రూ.5 లక్షలు కంటే విలువైన మందులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నప్పుడు ఖచ్చితంగా టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదని అధికారులు గుర్తించారు. కనీసం మందులు ఎవరు తీసుకెళ్లారు, మందులు కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు లేకపోవడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు నెలలుగా ఈఎస్ఐ ఆస్పత్రులలో మందులు లేవని రోగులు చెప్తున్నారు. మందులు లేవని ఆస్పత్రులలో చెప్తుండగా మందుల కొనుగోలు చేసినట్లు రూ.200 కోట్లు లెక్కలు చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags : esi medicine scam updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *