ప‌ట్ట‌ణాభివృద్ధిలో ప‌రుగు

Telangana Liveable Cities

తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్ లో విడుదల చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఇతర విభాగాధిపలుతు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలు మార్చాలన్న లక్ష్యంతో ముందుకుపోతుందని తెలిపారు. పట్టణాలు పురోగతి సాధించేందుకు ప్రభుత్వంతో పాటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కే. తారకరామారావు అన్నారు. దీర్ఘకాలంలో పట్టణాలన్నింటిని ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్ మరియు లవబుల్ సిటీలుగా మార్చాలన్న బృహత్తరమైన, దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరం అయిన ప్రాథమిక సౌకర్యలపైన ప్రస్తుతం తమ దృష్టి ఉన్నదన్నారు.

తెలంగాణ పురపాలక శాఖ రూపొందించిన ప్రగతి నివేదిక లోని కీలకమైన అంశాలిలా ఉన్నాయి.

నూతన పురపాలక చట్టం 2019
రాష్ట్రంలోని పురపాలికల్లో సమగ్రమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది జిహెచ్ఎంసి మినహా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తుంది. ఈ చట్టంతో పట్టణాల్లో నూతన శకం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లింపు మొదలుకొని 100% ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ ప్రక్రియ వరకు అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రతి పురపాలిక బడ్జెట్ లో పది శాతం హరిత బడ్జెట్ గా ఉంచాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ప్రతి వార్డు లో నాలుగు వార్డు స్థాయి కమిటీలను 15 మందితో ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. తద్వారా పురపాలనలో పౌరుల భాగసామ్యన్ని పెంచేలా చర్యలుతీసుకున్నది.

నూతన పురపాలికల ఏర్పాటు
తెలంగాణలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పరిపాలనను మరింతగా వికేంద్రీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పాత మునిసిపాలిటీలతోపాటు, నూతన కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 78 స్థానిక సంస్థల సంఖ్యను 139 పెంచడం జరిగింది. ఇందులో 13 నూతన మున్సిపల్ కార్పొరేషన్ లు కూడా ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లతో పాటు అన్ని మున్సిపాలీటీలకు 2020 జనవరిలో పురపాలక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

పురపాలక పట్టణాలకు ప్రత్యేక నిధుల అండ
నూతనంగా ఏర్పాటుచేసిన పురపాలక పట్టణాలతోపాటు గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించడం జరిగింది. ముఖ్యంగా టియూయప్ ఐడిసి సంస్థ ద్వారా 110 పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం మొదటిసారి. ఈ నిధులను నేరుగా అభివృద్ధి కార్యక్రమాలపై ఉపయోగించాలని పురపాలక శాఖ నిర్దేశించడం జరిగింది. తద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకున్నది

పట్టణ రోడ్లకు మహర్దశ
పురపాలక శాఖ తన పరిధిలోని పట్టణాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ఇచ్చిన ప్రత్యేక నిధులను ప్రతి పట్టణంలో ప్రధాన రోడ్లపైన ఖర్చు చేసేలా ఇంజనీరింగ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. కనీసం పట్టణానికి ఒక్క ప్రధాన రోడ్డుని అయినా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించింది. పురపాలక శాఖా హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో సిఆర్ఎంపి, ఎస్ఆర్ డి పి వంటి రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. మొదటిసారిగా రోడ్ల నిర్వహణలో మంచి పేరున్న పెద్ద కంపెనీలకు రోడ్ ల నిర్వహాణనను అప్పజెప్పింది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ఆరు వందల తొంభై కిలోమీటర్ల మేర రోడ్లను ఆరు ప్రధాన ఏజెన్సీలకు నిర్వహణ అప్పజెప్పింది. ఇంత పెద్ద ఎత్తున దీర్ఘకాలిక నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పడం దేశంలోనే మొదటి సారి. దీనికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు నగరంలో ప్రధానమైన మార్గాన్ని రద్దీ రహితంగా మార్చేందుకు మిస్సింగ్ రోడ్లు, స్లిప్ రోడ్లు, లింకు రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరిగింది. 38 ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జంక్షన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీంతోపాటు మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు మొదలుపెట్టింది.

Telangana Cities Are Growing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *