పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం?

Spread the love
Telangana Strengthening PanchayatiRaj

కొత్త పంచాయతీ రాజ్ చట్టం వెలుగులో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు.  పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సిఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపి బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుపట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వర్తించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండడం సమంజసం కాదు. ప్రజలతో ఎన్నికయిన ఎంపిపిలు, జడ్పీటిసిలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా పాలనలో భాగస్వామ్యం కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్ లు ఏం చేయాలి? జిల్లా పరిషత్ లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేసిన తర్వాతనే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుదిరూపం: సిఎం
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏఏ అంశాల్లో వారి బాధ్యతలు ఎంత వరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి దయాకర్ రావును ఆదేశించారు. పంచాయతీ రాజ్ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగిన నాయకులు, అధికారులు, విషయ నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని కోరారు. ముసాయిదాపై ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, చివరికి అసెంబ్లీలో కూడా విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా తీసుకుని, ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదంతా జరిగిన తర్వాత, మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.

పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి: సిఎం
పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇవోపిఆర్డీ పోస్టులను ఇకపై మండల పరిషత్ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సిఇవోలు, డిపిఓలు, సిఇవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలని చెప్పారు.

chief minister kcr, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *