ప్రక్షాళనకు టీపీసీసీ సిద్ధం

TPCC is ready for cleansing

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రక్షాళనకు సిద్దం అవుతోంది. గత శాసనసభ ఎన్నికల నుంచి ప్రస్తుత స్థానిక సంస్థల పోరు వరకూ సమన్వయ లోపంతో మూల్యం చెల్లించుకున్న ఆ పార్టీ ఇప్పుడు మేలుకొంది. TPCCని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. కొన్ని రోజులుగా హస్తం పార్టీ నేతల మధ్య పొరపొచ్చాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్నా.. అప్పటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అయినా.. ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజల్లోకి వెళ్లడంలో ప్రభుత్వంపై వ్యతిరేకత మూటగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా.. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసారు. మహాకూటమిగా జట్టుకట్టినా.. లాభం లేకుండాపోయింది. ఒకరిద్దరు తప్ప.. బలమైన నేతలు కూడా ఓడిపోయారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19మంది గెలిచారు. అయితే.. అందులో 11మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరికొంతమంది శాసనసభ్యులు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో ఇద్దరు కారెక్కితే.. సీఎల్పీని… టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తారనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే… జాతీయ పార్టీ.. ఓ ప్రాంతీయ పార్టీలో విలీనమైన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ మూటగట్టుకుంటుంది. పార్టీ మారే సమయంలో నాయకత్వం తీరుపై నేతలు తీవ్రంగానే విమర్శిస్తున్నారు. నాయకుల అసమర్ధత వల్లే పార్టీని వీడుతున్నామంటూ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.

ఇలా పార్టీ మారుతున్న నేతలు చేస్తున్న ఆరోపణలకు తగ్గట్లుగానే గాంధీభవన్‌లో పరిస్థితులున్నాయి. ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు, అఖిలపక్షాన్ని కో ఆర్డినేట్ చేయడంలో టీపీసీసీ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా.. నేతలెవరూ రాకపోవడంతో.. గాంధీభవన్ బోసిపోయి కనిపిస్తోంది. నేతలు రారు.. ఆందోళనలు చేయరు.. కేడర్‌ను కలవరు అనే చందంగా పరిస్థితి మారిపోయింది. చివరకు.. గాంధీభవన్ వేదికగా విద్యార్థి, యువజన విభాగం నేతలు 48 గంటల దీక్ష చేపడితే.. టీపీసీసీ అధ్యక్షుడు కానీ.. సీఎల్పీ నేత కానీ సంఘీభావం ప్రకటించలేదు. అటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా లైట్‌గా తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించనుంది. పని చేసే నాయకులకే పట్టం కట్టి పని చెయ్యని నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *