15వ శతాబ్దంలో తిరుమల మూసివేత

tirumala closed due to corona

తిరుమల ఆలయానికి కరోనా ప్రభావం తాకింది. నిత్యం 60, 70 వేల మంది భక్తులు దర్శించుకునే శ్రీవారి ఆలయం శుక్రవారం నుంచి భక్తులు లేక వెలవెల బోనుంది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనానికి రావటంతో కరోనా ప్రబలుతుంది అన్న భయంలో స్వామి వారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపి వేయనున్నట్లు  టీటీడీ  ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే భక్తులను కొండ మీదికి అనుమతించడం నిలిపి వేశారు. అలిపిరి చెక్‌పోస్టును మూసేశారు. ఏదో గ్రహణం వేళల్లో కొన్ని గంటల పాటు మాత్రం దొరకని శ్రీవారి దర్శనం ఇప్పుడు నిరవధికంగా కొన్ని రోజుల పాటు లభించబోదన్న వార్త  శ్రీవారి భక్తులను కలవర పెడుతోంది. అయితే.. శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు పూర్తిగా వాస్తవం కాదు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు అలాగే కొనసాగుతాయి. ఇక శ్రీవారి ఆలయం గతంలో ఓ సారి పూర్తిగా మూసివేతకు గురైందన్న విషయం చాలా మంది శ్రీవారి భక్తులకు తెలియదు.

విజయనగర చక్రవర్తుల కాలంలో తిరుమల శ్రీవారి ఆనంద నిలయం ఏకంగా పన్నెండు ఏళ్ల పాటు మూసివేతకు గురైంది. తిరుమల వేంకటేశ్వరుని నగలు ధరించారన్న ఆరోపణతో సుమారు అయిదు వందల ఏళ్ళ క్రితం అంటే 15వ శతాబ్ధంలో సాళువ నరసింహరాయలు 12మంది అర్చకులను శిరచ్ఛేదం చేయించారని, ఆ కారణంగా చక్రవర్తితోపాటు మొత్తం వంశానికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకోవడంతో దాన్ని నివారించేందుకు వ్యాస రాయలు కాలంలో 12 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మూయించారని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పుడు ప్రధాన అర్చకుడు వ్యాస రాయలు దేవాలయంలో పూజలు చేశాడనీ, ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా వారికి దర్శనం అయ్యేందుకు విమాన వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠించారని ఓ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఐతే ఇలా ఆలయాన్ని మూసివేశారని, 12 మంది అర్చకులు మరణించారని చెప్పేందుకు ఆధారాలు మాత్రం లేవని చెబుతుంటారు. ఇక అప్పటి నుండి ఆ తర్వాత అయిదు వందల ఏళ్ళుగా శ్రీవారి ఆలయాన్ని ఏ సందర్భంలోను మూసివేసిన సందర్భం లేదు. అయితే భక్తుల దర్శనాలను నిలిపి వేసిన ఉదంతం 1892లో మాత్రం కొన్ని రోజుల పాటు భక్తుల దర్శనాలను నిలిపి వేశారని టీటీడీ ఈవో సింఘాల్ చెబుతున్నారు.ఇన్నేళ్లలో ఎప్పుడూ శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన సందర్భాలు లేవు.. ఈసారి కరోనా భయంతో ఆలయాన్ని మూసివేస్తున్న నేపథ్యంలో స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతాయని తెలుస్తుంది .

tags: coronavirus, corona effect, tirumala, ttd, tirumala shrine shut down, singhal, TTD E.O, 15th century

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *