తమిళనాడులో కట్టలు కట్టలు దొరుకుతున్నాయ్

7
4.9 crore cash seizure in two day
4.9 crore cash seizure in two day

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో నోట్ల కట్టలు బీభత్సంగా దొరుకుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పంచడానికి అభ్యర్థులు దాచుకున్న, అక్రమంగా రవాణా చేస్తున్న నగదుతోపాటు బంగారం, వెండిని నిఘా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు తమిళనాడులో దాదాపు రూ.264 కోట్ల నగదు పట్టుబడింది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు నటుడు కమల్ హాసన్ సన్నిహితుల నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కమల్ సన్నిహితుడు లేరోన్ మొర్సాయి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి దాదాపు రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

అలాగే చెన్నై పల్లవరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు ఒక కారులో రూ.4 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు గుర్తించారు. ఇక మంగళవారం రాత్రి తిరుచ్చిరాపల్లి-కరూర్ రహదారిపై రెండు కార్లలోని వ్యక్తులు వాదులాడుకుంటుండగా అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చారు. దీంతో వారిని చూడగానే ఒక కారులో వ్యక్తులు పారిపోయారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో కారుకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన బియ్యం మూట కనిపించగా.. దానిని విప్పి చూస్తే రూ.కోటి నగదు బయటపడింది.