టీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తోందని అఖిలపక్ష భేటీలో నేతల ఫైర్

TRS Docent helped BC candidates

టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదన్నారు. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ఒక్క సీటు కేటాయించకుండా మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై జరిగిన చర్చలో పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను బీసీలు క్షమించబోరని అన్నారు. బీసీల ఓట్లతో గెలిచి వారికి వెన్నుపోటు పొడవడం సరికాదన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా ఐక్యమత్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ గణన చేయకుండానే ఎన్నికలకు సిద్ధం కావడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటే బీసీ రిజర్వేషన్లు సాధించడం సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు సాధించేవరకు బీసీలు విశ్రమించొద్దని.. పోరాటం చేస్తేనే విజయం తథ్యమని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *