తాజ్‌ అందాలకు ట్రంప్‌ ఫ్యామిలీ ఫిదా…

Trump Family Fidaa With Tajmahal Beauty

అమెరికా అధినేత ట్రంప్‌ దంపతులకు భారత పర్యటన ఒక స్వీట్ మెమరీగా మారింది. అద్భుతమైన స్వాగతం, అంతకుమించిన ఆతిథ్యంతో ట్రంప్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అయింది. తొలిరోజు పర్యటన ఉత్సాహంగా, ఆప్యాయంగా సాగింది. ప్రతి విషయాన్నీ వారంతా ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నట్లుగా కనిపించారు. పర్యటనలో అందరినీ ఆప్యాయంగా పలకరించారు ట్రంప్‌ దంపతులు.ఎలాంటి ఆహ్వానాన్ని అయితే ట్రంప్‌ ఆశించారో అంతకు మించిన అతిథి మర్యాదలు భారత్ లో ఆయనకు జరిగాయి.

భారత్‌లో అడుగు పెట్టిన ట్రంప్ బ్లాక్‌ సూట్‌లో కనిపించగా వైట్‌ డ్రెస్‌లో మెలానియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  మొదట సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించింది ట్రంప్‌ ఫ్యామిలీ. తన భార్యతో కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. ఇద్దరూ కొద్దిసేపు చరఖాపై నూలు వడికారు. ఆ తర్వాత సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. మెలానియా కూడా సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ దంపతులకు ప్రధాని మోదీ మూడు కోతుల ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఆశ్రమం సభ్యుడు కార్తికేయ సారాభాయ్‌.. ట్రంప్ దంపతులకు గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు. మొత్తం 15 నిమిషాలపాటు సబర్మతి ఆశ్రమంలో ట్రంప్‌ దంపతులు సరదాగా గడిపారు. సెల్ఫీలు తీసుకున్నారు.

ఇక ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌ మహల్ సందర్శన ట్రంప్ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయేలా సాగింది. తాజ్‌మహల్‌ అందాలను  ట్రంప్‌ ఫ్యామిలీ తనివితీరా వీక్షించారు. ఓ వైపు ట్రంప్ దంపతులు, మరోవైపు ఇవాంక దంపతులు, ఇంకోవైపు తాజ్‌మహల్ సూర్యాస్తమయ వేళ ట్రంప్ ఫ్యామిలీ చారిత్రక కట్టడాన్ని వీక్షించింది. తాజ్ అందాలను వీక్షించడానికి ఈ రెండు జంటలకు నాలుగు కళ్లు సరిపోలేదు. ఒళ్లంతా కళ్లు చేసుకొని మరి తాజ్ సౌందర్యాన్ని ఆస్వాదించారు. తాజ్ టూర్‌లోనూ ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజ్ మహల్‌ను చూసి ఇవాంక ముగ్దురాలైపోయారు.

తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకున్నారు.ట్రంప్ కుటుంబసభ్యులు దాదాపు 50 నిమిషాల పాటు తాజ్‌ ఒడిలో స్వేచ్ఛగా సంచరించారు. సుందర కట్టడాన్ని అణువణువూ పరిశీలించారు. తాజ్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గైడ్‌, ట్రంప్ కుటుంబ సభ్యులకు తాజ్ విశేషాలను వివరించారు. మళ్లీ తాజ్‌ మహల్‌ను సందర్శిస్తామని ఈ సందర్భంగా గైడ్‌తో చెప్పారు ట్రంప్‌ దంపతులు.అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు, మొదట సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలు రాశారు. భారతదేశ మహోజ్వల సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వానికి తాజ్‌మహల్ తార్కాణంగా నిలుస్తోందని అభివర్ణించారు.ఇక టూర్‌ మొత్తం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌, ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసుకుంది ట్రంప్‌ ఫ్యామిలీ.

Trump Family Fidaa With Tajmahal Beauty,#trumptour, USA,#melania, samarmathi ashramam , india,#taj mahal ,#ivanka trump

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *