కాశ్మీర్ తుట్టె కదిపిన ట్రంప్

Spread the love

TRUMP ON KASHMIR

  • భారత్, పాక్ కోరితే మధ్యవర్తిగా ఉంటానని వ్యాఖ్య
  • మోదీ కూడా కోరారని వెల్లడి
  • ట్రంప్ వ్యాఖ్యలపై దుమారం

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై మధ్యవర్తిగా ఉండాలంటూ భారత ప్రధాని మోదీ కూడా తనను కోరారని ట్రంప్ పేర్కొనడం కలకలం సృష్టించింది. భారత్ లోని విపక్ష పార్టీలు ఈ అంశంపై మండిపడ్డాయి. కాశ్మీర్ వ్యవహారంపై ట్రంప్ ను మధ్యవర్తిగా ఉండమని కోరారా లేదా సభలో మోదీ ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశాయి. అయితే, కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ తనను కోరినట్టు  ట్రంప్‌ చెప్పడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో ట్రంప్‌ సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కావాలని భారత్‌, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, కాశ్మీర్ గురించి నేను చాలా విన్నాను. అది చాలా అందమైన ప్రదేశం. కానీ ఇప్పుడు అక్కడ బాంబుల మోత మోగుతోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

అక్కడే ఉన్న ఇమ్రాన్‌.. ట్రంప్‌ ప్రతిపాదనను స్వాగతించారు. కాశ్మీర్ సమస్యపై ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తే లక్షలాది మంది ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం భారత పార్లమెంటును కుదిపేసింది. కాశ్మీర్‌ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవాలని ఎలా అడుతుతారని ప్రశ్నించాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్‌ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. దీంతో రాజ్యసభలో విదేశాంగ మత్రి జైశంకర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ అంశంపై భారత్ లో దుమారం రేగడంతో అమెరికా కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కాశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా స్వాగతిస్తుందని పేర్కొంది. అమెరికా కేవలం ఈ విషయంలో సహకారం మాత్రమే అందిస్తుందని స్పష్టంచేసింది. మొత్తమ్మీద కాశ్మీర్ తేనెతుట్టెను కదిపిన అమెరికా.. భారత్ లోని విపక్ష పార్టీలకు మంచి అస్త్రం అందించింది.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *