భవన అనుమతులు ఇక సరళతరం.. టీఎస్ బీపాస్ షురూ

3
Ts b Pass starts
Ts b Pass starts

తెలంగాణలో భవన అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతులు పొందిన పలువురికి అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. ‘తెలంగాణలోని 43 శాతం జనాభా పట్టణ ప్రాంతంలో ఉంది. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉంది. ఒకవైపు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతూనే మరోవైపు అధికార వికేంద్రీకరణ ద్వారా పౌరులకి మంచి సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంస్కరణలు చేపట్టారు. ఆ మేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల, గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేశాం. ప్రజలకు మేలు చేసే చట్టాలను ఏర్పాటు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, ఈ స్పూర్తితోనే టీఎస్ బీపాస్ వంటి చట్టాలు తీసుకొస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఈ విధానంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా తక్షణమే అనుమతులు లభిస్తాయని తెలిపారు. ‘75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతి వస్తుంది. 600 గజాల పైన 21 రోజుల్లో అనుమతి ఇస్తాం… లేకుంటే అనుమతి వచ్చినట్టుగానే భావించొచ్చు. అయితే, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు, అబద్ధాలు, తప్పుడు ధ్రువీకరణ చేస్తే భవన నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఎంత విశ్వాసంతో మీ అందరికీ స్వీయ దృవీకరణ అవకాశం ఇచ్చినదో అంతే విశ్వాసంతో ప్రజలంతా దీని అనుసరిస్తారని ఆశిస్తున్నాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టణాలు పెరుగుతున్న మేరకు క్రమబద్ధీకరణ, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగకపోవడంతో మొన్న వచ్చిన వరదల వంటివి పదేపదే వస్తున్నాయని.. అందుకే నూతన జీహెచ్ఎంసీ చట్టంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిబంధనలను చేర్చబోతున్నామని వెల్లడించారు. అనంతరం క్రెడాయ్ రామృష్ణ మాట్లాడుతూ.. ‘మా రియల్ ఎస్టేట్ డెవలపర్ల కల నెరవేరినట్లు అనిపిస్తుంది, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇలాంటి అనుమతుల ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఇందుకోసం కోసం పనిచేసిన పురపాలక శాఖ అధికారులు అందరికీ, మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ts news