టీవీ9 కు హ‌వాలాలో నిధులా?

Spread the love

tv9 funds through hawala route

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సంచలన ఆరోపణల్ని హైకోర్టుకు నివేదించటం హాట్ టాపిక్ గా మారింది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం , లోగో విక్రయం వంటి పలు నేరారోపణలు ఉన్న ఆయన.. తాజాగా ఆ చానల్ లో వాటా విక్రయించిన సందర్భంలో హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని.. కశ్మీర్ లో ఉగ్రవాదులకు నిధులు తరలించే మార్గాల్లో ఈ నిధులు వచ్చాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.వీటన్నింటిపైనా దర్యాప్తు చేయాలని.. సీబీఐ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లకు తాను ఇటీవల ఫిర్యాదు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసిన నాటి నుంచి తనను తెలంగాణ ప్రభుత్వం వెంటాడుతుందన్న ఆయన.. తనపై తెలంగాణ పోలీసులు తప్పుడు కేసులతో అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

తానుచేసిన ఆరోపణలతో ప్రభుత్వమే తనను టార్గెట్ చేసిందని.. అందుకు పోలీసుల్ని వినియోగించుకుంటుందన్న వాదనను రవిప్రకాశ్ తెర మీదకు తెచ్చారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. పోలీసు విచారణలో రవిప్రకాశ్ తమకు సహకారం అందించలేదంటూ పోలీసులు చెబుతున్న వేళ.. తాజాగా బెయిల్ పిటిషన్ పై కోర్టులో రవిప్రకాశ్ తరఫు లాయర్లు వినిపించిన వాదనలు తీరు కొత్తగా ఉండటమే కాదు.. ఊహించని రీతిలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.తనను అరెస్ట్ చేయాలన్న పోలీసుల లక్ష్యాన్ని నీరుకార్చే రీతిలో రవిప్రకాశ్ వాదనలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ లేని రీతిలో సరికొత్త వాదనను తెర మీదకు తేవటం ద్వారా.. ఆ చానల్ కొనుగోలు విషయంలో వచ్చిన నిధులపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేశారని చెప్పాలి. తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఇప్పటివరకూ ఈ ఎపిసోడ్ పై కొత్త సందేహాలు కలిగేలా చేయటంలో రవిప్రకాశ్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. అయితే.. పోలీసులు 40 గంటల పాటు ఏం ప్రశ్నించాలని భావిస్తున్నారని?. వారికేం చెప్పాలని రవిప్రకాశ్ తరఫు లాయర్ వినిపించిన వాదన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. రవిప్రకాశ్ తరఫున దిల్జీత్ సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా రవిప్రకాశ్ ను పోలీసులు.. ప్రభుత్వం వేధిస్తున్నట్లుగా ఆయన ఆరోపణలు చేశారు. వివాదంగా మారిన ఆ చానల్ ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని.. ప్రస్తుతం ఆ చానల్ లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆరోపించారు.90 శాతం వాటాల కొనుగోలుకు రూ. 500 కోట్లకు రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఇందులో రూ. 294 కోట్లు నగదుగా ఇచ్చారని – ఇది హవాలా మార్గంలో తరలించారన్నారు. అలాగే ఏవైనా కేసుల్లో ఎఫ్ఐఆర్ను ఎస్ హెచ్ వో నమోదు చేయాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా రవిప్రకాశ్ విషయంలో జరిగిందన్నారు. ఆయనపై కేసులో స్వయంగా ఎసీపీ రంగంలోకి దిగటాన్ని చూస్తే.. అధికార దుర్వినియోగం స్పష్టం కనిపిస్తోందన్నారు. కోర్టు షరతులకు లోబడి ఉంటారని.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. పోలీసుల తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ భిన్నమైన వాదనలు వినిపించారు.

రవిప్రకాశ్ తన వాటాలో 40వేల షేర్లను శివాజీకి విక్రయించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. 2018 ఫిబ్రవరిలో వాటాల్ని అమ్మినట్లుగా రవిప్రకాశ్ చెబుతున్నారని.. అదే నిజమైతే వాటిని రికార్డుల్లో చూపించాల్సి ఉంటుందన్నారు. ఐటీ విభాగానికి సమర్పించిన రికార్డుల్లోనూ వాటిని చూపలేదన్నారు. టీవీ9 లోగోను.. బ్రాండ్ పేరును రవిప్రకాశ్ అక్రమంగా అమ్మారని.. వాటికి వాటాదారుల అనుమతి లేదన్నారు. తప్పు చేయనప్పుడు పోలీసుల ముందుకు విచారణకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఇలా..ఒకరికొకరు ధీటుగా వాదనలు వినిపించారు . ఇక ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

tv9 latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *