రవి ప్రకాష్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

Vijay sai Comments On TV9 Raviprakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై వరుస పెట్టి విమర్శలు చేస్తున్న ఏకైక రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాత్రమే. సంస్థను మోసం చేసేలా ఫోర్జరీ.. తదితర నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. గడిచిన నాలుగు రోజులుగా ఎవరికి దొరక్కుండా ఉండటం తెలిసిందే.

ఈ ఉదంతంపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. రవిప్రకాశ్ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విచిత్రంగా.. ప్రతి ఒక్కరు రవిప్రకాశ్ పై ఆగ్రహమే తప్పించి.. ఎవరూ దన్నుగా నిలవని పరిస్థితి కనిపిస్తోంది. రవిప్రకాశ్ తో పాటు.. తనకెంతో ప్రియ ప్రత్యర్థి చంద్రబాబు మీద కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమి పక్కా అని ఆ విషయం ఇప్పటికే చేసిన రివ్యూల్లో బాబుకు అర్థమైందని వ్యాఖ్యానించటం గమనార్హం.

తాజాగా రవిప్రకాశ్ పై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు ఆసక్తికరంగానే కాదు.. సెటైరిక్ గా ఉన్నాయి. రవిప్రకాశ్ పై విజయసాయి చేసిన ట్వీట్లను యథాతధంగా చూస్తే..
పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు – చట్టాలు – కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది! విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో! సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్ కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *