ఏపీ బీజేపీలో వర్గ పోరు .. సుజనా వర్సెస్ కన్నా

Spread the love

WAR IN AP BJP

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.. కొత్తగా పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యం దక్కుతండటంతో ఇంతకాలం అగ్రనేతలుగా చెలామణి అయిన వారు మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీలో చేరిన తర్వాత .. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. సుజనా చౌదరికి బీజేపీ అదిష్టానం అగ్రతాంబూలం ఇస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తోంది. కన్నాకు తెలియకుండానే పార్టీ వ్యవహారాలు సాగిపోతుండటంతో అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులు రెండు గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితులు నెలకొన్నాయి.

గతంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ.. నాటకీయ పరిణామాల మధ్య కన్నా కాషాయ కండువా కప్పుకు న్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను పట్టుబట్టి మరీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్ఠానం. వాస్తవానికి కన్నా వైసీపీలో చేరుంటే ఇప్పుడు జగన్ కాబినెట్లో మంత్రి పదవి దక్కేది. అయితే.. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తనకు పదవి దక్కుతుందని ఆయన బీజేపీలోనే కొనసాగడంతో కన్నా ఆశలు అడియాశలయ్యాయి.

కన్నా రాజ్యసభ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ మారేటప్పుడు రామ్ మాధవ్ కన్నాకు ఎన్నో ఆశలు పెట్టారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కన్నా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలో మారిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్నాను అధిష్ఠానం పట్టించుకోవడంలేదని పార్టీలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని పాతతరం నేతలు అసం తృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే .. పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. టీడీపీ నలుగురు ఎంపీల చేరికలపై… కన్నాకు కనీస సమాచారం లేదు. అంతేగాదు.. ఆ తర్వాత చాలా మందిని బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారి గురించి కన్నాతో కనీస చర్చలు కూడా జరపలేదు. పైగా… ఏపీకి వస్తున్న జాతీయ నేతలు.. సుజనా నేతృత్వంలో బీజేపీ బలపడుతుందని ప్రచారం చేస్తుండటంతో కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తికి గురవుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ తనను పక్కన పెట్టిందని భావిస్తున్న కన్నా… గత ఆదివారం సుజనా చౌదరి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉన్నప్పటికీ అసలు ఆ కార్యక్రమానికే హాజరుకాలేదు. ఆయనతోపాటు చాలా మంది నేతలు కూడా సమావేశానికి డుమ్మాకొట్టారు. ఈ పరిస్థితి కేవలం కన్నాకు మాత్రమే పరిమితంకాలేదు. గతంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన సోము వీర్రాజు విష్ణుకుమార్ లాంటి పాతకాపు నేతలకు సరైన ప్రాధాన్యం దక్కడంలేదని చర్చ జరుగుతోంది. వాళ్ల వాయిస్ కూడా ఎక్కడా వినిపించడంలేదు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో సుజనా చౌదరి హవా కొనసాగుతోందని ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

CHANDRABABU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *