ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది జగన్ సార్?

What Happened To AP Special Status?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ 100 రోజుల పాలనపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. అమరావతిని గోస్ట్ సిటీలా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఆపేసి పెద్ద తప్పు చేశారంటూ మండిపడ్డారు. పోలవరం రీటెండరింగ్ వల్ల నష్టాలే తప్ప ప్రయోజనాలు ఏమాత్రం ఉండవన్నారు. జగన్ పరిపాలనలో హామీలే తప్ప అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన సీఎం జగన్ వాటిని ఎక్కడ అమలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తామన్న 5శాతం కాపు రిజర్వేషన్ల కోటాను కూడా ఎత్తేశారంటూ మండిపడ్డారు.

మరోవైపు ఆశావర్కర్లు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు కానీ వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని సుజనా చౌదరి విమర్శించారు. పెంచిన జీతాలు ఎలా ఉన్న అంతకు ముందు ఇచ్చిన జీతాలను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీతాలపై ఎందుకు రోడ్డెక్కుతున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. గత ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై పనులు చేపట్టిందవని దానిపై కీలక నిర్ణయమని జగన్ ప్రభుత్వం ప్రకటించిందని దానిపై పూర్తి వివరాలు ఎందుకు ప్రకటించడం లేదో చెప్పాలని నిలదీశారు. పారిశ్రామిక పెట్టుబడులు నిమిత్తం ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని చెప్పుకొచ్చారు. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం, రాష్ట్రంలో అనిశ్చితి వల్ల ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు రావడం లేదని విమర్శించారు.

భారత రాజ్యాంగం ప్రకారం పరిశ్రమలలో 75 శాతం రిజర్వేషన్ అనేది చెల్లుబాటు కావన్నారు. రాష్ట్రంలో అనేక కంపెనీలు, హోటల్స్ ఇతర సంస్థలు ఇతర ప్రాంతాలకు చెందినవి ఉన్నాయని వాటిలో కూడా 75 శాతం రిజర్వేషన్లు అంటే వారంతా తమ ప్రాంతాలు వెళ్లిపోయే పరిస్థితి నెలకొందన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన వల్ల పరిశ్రమలు నిలబడవని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పోర్టుల పరిస్థితికే దిక్కులేదని తాజాగా మరో నాలుగు పోర్టులు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటనలు చూస్తుంటే తినడానికి తిండిలేదు మీసాలకు సంపంగి నూనె అన్న చందంగా ఉందన్నారు. ఇకపోతే ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం ఒక జోక్ అంటూ కొట్టిపారేశారు. ప్తర్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలను మభ్యపెట్టడం, కేంద్రంతో వైర్యం పెంచుకోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. హోదా ఇచ్చే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు సుజనాచౌదరి. వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలనలో జరిగిన భూకబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అంటూ నిలదీశారు.

AP Latest Updates, #ysjagan

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *